Begin typing your search above and press return to search.

మారుతున్న ట్విట్టర్..: పరాగ్ అగర్వాల్ స్థానంలో కొత్త సీఈవో..?

By:  Tupaki Desk   |   3 May 2022 10:30 AM GMT
మారుతున్న ట్విట్టర్..: పరాగ్ అగర్వాల్ స్థానంలో కొత్త సీఈవో..?
X
వరల్డ్ టాప్ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ కంపెనీ యాజమాన్యం మారడంతో ఉద్యోగుల భవిష్యత్ ఆందోళనకరంగా మారింది. ప్రపంచ కుభేరుడు ఎలెన్ మస్క్ ట్విట్టర్ కంపెనీని 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న తరువాత కొత్త ఉద్యోగులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త సీఈవోను కూడా నియమించుకుంటారని ప్రచారం సాగుతోంది. దీంతో ట్వీట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్ తన పదవి నుంచి తప్పుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా మిగతా ఉద్యోగుల భవిష్యత్ కూడా ఆందోళనకరంగా మారిందని అంటున్నారు. ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ఇటీవల ఎలెన్ మస్క్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంపై రాయిటార్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుత యాజమాన్యంపై తమకు ఏమాత్రం విశ్వాసం లేదని ఎలెన్ మస్క్ ఓ ఉన్నతాధికారితో చెప్పినట్లు సమాచారం.

భారతీయ సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ గత సంవత్సరమే ట్విట్టర్ సీఈవో గా బాధ్యతలు చేపట్టారు. అయితే ట్విట్టర్ ను ఎలెన్ మస్క్ సొంతం చేసుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో కంపెనీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని పరాగ్ తన తోటి ఉద్యోగులతో అన్నారు. అన్నట్లుగానే పరాగ్ అగర్వాల్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో పరాగ్ ద్వారా ట్విట్టర్లో జాయిన్ అయిన ఉద్యోగులు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే అధికారికంగా కంపెనీ బాధ్యతలు మారే వరకు ఏ డోకా లేదని వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే పరాగ్ అగర్వాల్ ను తన బాధ్యతల నుంచి తీసివేయాల్సి వస్తే 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ చెల్లింపుపై కూడా ఎలెన్ మస్క్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఉద్యోగులను మార్చే క్రమంలో పరిహారం చెల్లించాల్సి వస్తే వాటిపై ఎలెన్ మస్క్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడట. అయితే పరాగ్ అగర్వాల్ స్థానంలో కొత్త సీఈవో ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఇక మిగతా ఉద్యోగుల్లో కూడా చాలా మార్పులు ఉంటాయని ప్రచారం సాగుతోంది. లేదా ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ట్విట్టర్ కంపెనీలో పరాగ్ అగర్వాల్ తరువాత మరో అధికారిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఆమె.. లీగల్ హెడ్ విజయ గద్దె. ఈమె ప్రస్తుతం కంపెనీలోని న్యాయపరమైన వ్యవహారాలను చూసుకుంటుంది. ట్విట్టర్లో సున్నితమైన అంశాలను డీల్ చేయడంలో విజయ దిట్ట.

గతంలో అభ్యంతకర పోస్టులు, వాక్ స్వాతంత్ర్యంపై ప్రపంచ స్థాయిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సమయంలో విజయ గద్దె చాకచక్యంగా వ్యవహరించారు. వివాదాస్పద ట్వీట్లు పెట్టిన వారిని ట్విట్టర్ నుంచి తొలగించేందుకు ఏమాత్రం వెనుకాడరు. అయితే ఉద్యోగుల మార్పుల జాబితాలో విజయ గద్దె కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

ట్విట్టర్ కంపెనీ యాజమాన్యం చేతులు మారినప్పటి నుంచి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కడ తమ పోస్టు ఊడుతుందోనని భయభయంగా గడుపుతున్నారు. అయితే అధికారికంగా చేతులు మారేవరకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని అంటున్నారు. కానీ యాజమాన్యం చేతులు మారాక కంపెనీ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ ప్రభావం ట్విట్టర్ యూజర్లపై ఉంటుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది.