Begin typing your search above and press return to search.

చ‌రణ్‌జిత్ ముందు స‌వాళ్లెన్నో!

By:  Tupaki Desk   |   20 Sep 2021 4:30 PM GMT
చ‌రణ్‌జిత్ ముందు స‌వాళ్లెన్నో!
X
పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో వివాదాల‌కు తాత్కాలిక తెర‌ప‌డింది. అమ‌రీంద‌ర్ సింగ్ రాజీనామా త‌ర్వాత చ‌ర‌ణ్‌జిత్ సింగ్ సీఎం కావ‌డంతో అక్క‌డి రాజ‌కీయ ఆట‌లో పీసీసీ అధ్య‌క్షుడు న‌వ్‌జోత్ సింగ్ సిద్ధూ విజ‌యం సాధించిన‌ట్ల‌యింది. త‌న వ‌ర్గానికి చెందిన చ‌ర‌ణ్‌జిత్ సీఎం కావ‌డంతో సిద్ధూ హ్యాపీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ ఇక ముందే అక్క‌డ పార్టీకి ముఖ్యమంత్రి చ‌ర‌ణ్‌జిత్ సింగ్‌కు స‌వాళ్లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని రాజకీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఆ రాష్ట్రంలో జ‌రిగే శాస‌న స‌భ ఎన్నిక‌లు కాంగ్రెస్ పార్టీకి క‌ఠిన ప‌రీక్ష‌గా మార‌నున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దేశ‌మంతా మోడీ హ‌వా కొన‌సాగిన‌ప్ప‌టికీ పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్ అత్య‌ధిక లోక్‌స‌భ స్థానాలు గెలుచుకోగ‌లిగింది అంటే అందుకు కార‌ణం అమ‌రీంద‌ర్ అన‌డంలో సందేహం లేదు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఇత‌ర పార్టీల పోటీను త‌ట్టుకుని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అమ‌రీంద‌ర్ రెండో సారి ముఖ్య‌మంత్రి అయ్యారు. కానీ ఆ త‌ర్వాత న‌వ్‌జోత్ సింగ్ సిద్ధూతో విభేధాల కార‌ణంగా ప‌రిస్థితులు మారిపోయాయి. తాను వ‌ద్ద‌ని చెప్పినా సిద్ధూకే పీసీసీ ప‌ద‌వి ఇవ్వ‌డంతో అమ‌రీంద‌ర్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇక ఇప్పుడు సిద్ధూ మార్గ‌ద‌ర్శ‌నంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ఒత్తిడి త‌ట్టుకోలేకు అమ‌రీంద‌ర్ రాజీనామా చేశారు. దీంతో చ‌ర‌ణ్‌జిత్ సీఎం అయ్యారు. కానీ ఇప్పుడు చ‌ర‌ణ్‌జీత్ రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఎలా న‌డిపిస్తారు? వ‌చ్చే ఎన్న‌కల్లో పార్టీ విజ‌యం దిశ‌గా ఎలా సాగుతారు? అనే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

49 ఏళ్ల చ‌ర‌ణ్‌జిత్ సింగ్ (చ‌న్నీ) పంజాబ్‌కు తొలి ద‌ళిత ముఖ్య‌మంత్రి. తండ్రి నుంచి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని పుణికిపుంచుకున్నారు. విద్యార్థి ద‌శ నుంచి రాజ‌కీయాల‌పై ఆస‌క్తి పెంచుకున్నారు. మూడు సార్లు మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌గా రెండు సార్లు మున్సిప‌ల్ ఛైర్మ‌న్‌గా ప‌ని చేశారు. 2007లో చామ్‌కౌర్‌సాహిబ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి మ‌రీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో కాంగ్రెస్ చేరి వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ విజ‌యాలు సాధించారు. అమ‌రీంద‌ర్ మంత్రివ‌ర్గంలో మంత్రిగానూ ప‌నిచేశారు. ఇప్పుడు సీఎం అయ్యారు. జ్యోతిష్యాల‌ను బాగా విశ్వసిస్తార‌నే పేరున్న ఆయ‌న ముందు ఇప్పుడు స‌వాళ్లున్నాయి.

అమ‌రీంద‌ర్ రాజీనామాతో ఏర్ప‌డిన క‌ల్లోల ప‌రిస్థితుల‌ను ముందు చ‌న్నీ చ‌క్కపెట్టాలి. రాజ‌కీయాల్లో ఎంతో అనుభవం గ‌డించి కురువృద్ధుడిగా పేరు తెచ్చుకున్న అమ‌రీంద‌ర్ ఇప్పుడైతే సీఎం ప‌ద‌వికి మాత్ర‌మే రాజీనామా చేశారు. పార్టీ నుంచి ఇంకా సంబంధాలు తెంచుకోలేదు. ఈ నేప‌థ్యంలో అమ‌రీంద‌ర్‌తో క‌లిసి పార్టీ కోసం ప‌ని చేసేందుకు ఒప్పించాల్సిన అవ‌స‌రం చ‌న్నీపై ఉంది. ఒక‌వేళ అమ‌రీంద‌ర్ క‌లిసి రాక‌పోతే అది వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీపై ప్ర‌భావం చూపే వీలుంది. దీంతో పాటు పార్టీలో వ‌ర్గా విభేధాలు లేకుండా చూడాలి. అంద‌రూ క‌లిసి పార్టీ కోస‌మే ప‌ని చేసేలా స‌మ‌న్వ‌యం చేసుకోవాలి. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌నాలను త‌న వైపుగా తిప్పుకోవాలి. మ‌రోవైపు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ధీటుగా స‌మాధానం ఇవ్వాలి. ఇప్ప‌టికే పంజాబ్‌లో బ‌లోపేతంపై ఆమ్ ఆద్మీ దృష్టి పెట్టింది. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ , శిరోమ‌ణి అకాలీద‌ళ్‌లు అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చ‌న్నీ ఇటు ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్థంగా నడిపిస్తూ.. అటు సిద్ధూతో క‌లిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలి.