Begin typing your search above and press return to search.

ప్రియాంక పేరును మధ్యలో తీసుకొచ్చి బుక్ చేసిన ముఖ్యమంత్రి

By:  Tupaki Desk   |   10 Jan 2022 4:00 AM GMT
ప్రియాంక పేరును మధ్యలో తీసుకొచ్చి బుక్ చేసిన ముఖ్యమంత్రి
X
కాంగ్రెస్ పార్టీని ఎవరో దెబ్బ తీయాల్సిన అవసరం లేదు. ఆ పనిని.. ఆ పార్టీకి చెందిన నేతలతో తరచూ చేస్తుంటారు. ఎప్పుడు.. ఏ విషయం మీద మాట్లడాలన్న విషయం.. ఆ పార్టీకి చెందిన కీలక నేతలకు తెలియకపోవటం దేనికి నిదర్శనం? తాజాగా అలాంటి తప్పే చేశారు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేత చరణ్ జీత్ చన్నీ. పంజాబ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. అక్కడ తలెత్తిన పరిస్థితుల కారణంగా.. వంతెన మీద 20 నిమిషాల పాటు నిలిచిపోవటం.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

రైతుల నిరసన కారణంగా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పినా.. నిఘా వైఫల్యం.. భద్రతా ఏర్పాట్లలో చోటు చేసుకున్న తప్పులు తెర మీదకు వచ్చాయి. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకొని.. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇదిలా ఉంటే.. తాజాగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చన్నీ చేసిన వ్యాఖ్యలు.. ఆ పార్టీ ముఖ్యనేత ప్రియాంక గాంధీని బుక్ చేసేలా మారింది.

పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ కాన్వాయ్ నిలిచిపోవటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జీత్ చన్నీ మాట్లాడుతూ.. ప్రధాని పర్యటన లో ఎలాంటి భద్రతా పరమైన లోపాలు లేవని.. కిలోమీటర్ పరిధిలో ఆయన దరిదాపుల్లోకి ఎవరూ రాలేదన్నారు. ఇదే విషయాన్ని ప్రియాంక గాంధీకి వివరించినట్లు చెప్పారు. చెప్పినంత వరకు బాగానే చెప్పినట్లు కనిపించిన సీఎం చన్నీ.. చివర్లో ప్రియాంక పేరును ప్రస్తావించటంపై బీజేపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. సీఎం చన్నీపై ఘాటు విమర్శలు చేశారు.

అసలు ప్రియాంక గాంధీ ఎవరు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చరణ్ జీత్ చన్నీ.. ఆమె ఏ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారని.. మాట్లాడారు? అయినా.. ఆమె ప్రధాని భద్రత గురించి ఆరా ఎందుకు తీశారు? ఆ పని చేయటానికి ఆమె ఎవరు? అని ప్రశ్నించారు. అంతేకాదు.. పంజాబ్ ముఖ్యమంత్రి నిజాలు చెప్పాలని.. ఆమెతో.. మీరు చెప్పినట్లే పని పూర్తి అయ్యిందని కూడా చెప్పి ఉండాల్సిందంటూ మరింత డ్యామేజ్ చేసే వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేత.. పార్టీ అధినాయకత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వటం.. వారితో మాట్లాడటం మామూలే. అయితే.. ఈ విషయాన్ని ఓపెన్ గా ఏ ముఖ్యమంత్రి మాట్లాడరు. కానీ.. చన్నీ మాత్రం ఆ విషయంలో తప్పు చేశారు. తాను చేసిన తప్పునకు మూల్యంగా ప్రియాంక మీద మాట పడేలా.. విమర్శలకు గురయ్యే అవకాశాన్ని ఇచ్చారు. ఏమనా ఇలాంటివి కాంగ్రెస్ ముఖ్యమంత్రులే చేయగలుగుతారు.