Begin typing your search above and press return to search.

కీలక సమావేశానికి కొడుకు వెంటబెట్టుకెళ్లిన కొత్త సీఎం

By:  Tupaki Desk   |   4 Oct 2021 1:30 AM GMT
కీలక సమావేశానికి కొడుకు వెంటబెట్టుకెళ్లిన కొత్త సీఎం
X
ఇప్పుడు ఉన్న రచ్చ సరిపోదన్నట్లుగా వ్యవహరిస్తున్న పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కుర్చీలో కూర్చొబెట్టినప్పుడు బాధ్యతగా వ్యవహరిస్తూ.. పార్టీకి ఇప్పటికే జరిగిన డ్యామేజ్ ను తగ్గించాల్సింది పోయి.. కొత్త వివాదాల్ని తల మీదకు తెచ్చుకుంటున్న వైనం చూస్తే.. కాంగ్రెస్ కు కొత్త తిప్పలు తప్పవన్నట్లుగా ఉంది. ఇప్పటికే అసమ్మతితో కిందా మీదా పడుతున్న పార్టీకి.. పంజాబ్ లో ముఖ్యమంత్రిని మారుస్తూ తాము చేసిన ప్రయోగం ఏమవుతుందన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇలాంటివేళ కొత్త ముఖ్యమంత్రి చర్య ఇప్పుడు షాకింగ్ గా మారింది.

పంజాబ్ రాష్ట్ర డీజీపీ ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోటాతో సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి చరణ్ జింత్ సింగ్ చన్ని ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన తన కుమారుడు రిథమ్ జిత్ సింగ్ ను వెంట పెట్టుకు రావటం.. ఆయన్ను వెనుక వరుసలో కూర్చోబెట్టటం వివాదాస్పదంగా మారింది. కీలకమైన అధికారిక భేటీకి ముఖ్యమంత్రి తన కుమారుడ్ని వెంట పెట్టుకు రావటమా? అని ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ నిలదీస్తోంది.

ఈ అత్యున్నత స్థాయి భద్రతా సమావేశానికి సీఎం కొడుకు హాజరైన ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అధికారుల వెనుక సీట్లో కూర్చొని.. అక్కడ జరుగుతున్న వివరాల్ని ఆసక్తిగా వింటున్నట్లుగా ఆయన తీరు ఉంది. భద్రతా పరమైన సమావేశానికి.. రాజ్యాంగ పరంగా ఎలాంటి హక్కు లేని సీఎం కొడుకు సమావేశానికి రావటమా? అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తాజా చర్య విపక్షాలకు బలమైన అస్త్రం దొరికినట్లైంది.

ముఖ్యమంత్రి చర్యను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. గతంలో మాజీ మంత్రిగా వ్యవహరించిన ముఖ్యమంత్రికి నియమ నిబంధనలు తెలిసి ఉండాలని.. పాలనా వ్యవహారాల విశ్వసనీయత.. ఔన్నత్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందంటున్నారు. సీనియర్ బ్యూరోక్రాట్లతో నిర్వహించిన అత్యున్నత సమావేశానికి ముఖ్యమంత్రి తన కొడుకును వెంట పెట్టుకు రావటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇదో దుమారంగా మారి.. కాంగ్రెస్ పార్టీకి మరో తలనొప్పిగా మారటం ఖాయమంటున్నారు. దీనిపై కాంగ్రెస్ అధినాయకత్వం ఎలా రియాక్టు అవుతుందో?