Begin typing your search above and press return to search.

24 గంట‌లు...2.6 ల‌క్ష‌లు...ఓ ఇల్లు!

By:  Tupaki Desk   |   16 March 2018 11:30 PM GMT
24 గంట‌లు...2.6 ల‌క్ష‌లు...ఓ ఇల్లు!
X
``ఇల్లు క‌ట్టి చూడు....పెళ్లి చేసి చూడు అన్నారు`` పెద్ద‌లు! నిజ‌మే ప్ర‌స్తుతం మ‌ధ్య త‌ర‌గ‌తి వారి సొంతింటి క‌ల.... `క‌ల‌`గానే మిగిలిపోతోంది. ఇనుము - సిమెంట్ - ఇసుక రేట్లు - భ‌వన నిర్మాణ కూలీలు భారీగా పెర‌గ‌డంతో నిర్మాణ వ్యయాన్ని భ‌రించ‌లేక చాలా ఇళ్ల నిర్మాణాలు మ‌ధ్య‌లో ఆగిపోయిన సంద‌ర్భాలున్నాయి. ప్ర‌భుత్వ ప‌థ‌కాల ద్వారా వ‌చ్చిన కొద్ది మొత్తానికి....మూడు - నాలుగింత‌లు అప్పుసప్పు చేసి ఎలాగోలా ఇంటిని పూర్తి చేసిన ఘ‌ట‌న‌లు అనేకం. అన్ని సంద‌ర్భాల్లోనూ కామ‌న్ ప్రాబ్ల‌మ్ ఒక‌టే...అధిక వ్య‌యం. అందుకే, అతి చౌక ధ‌ర‌లో మ‌ధ్య త‌ర‌గ‌తి వారి సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చేందుకు అమెరికాలోని `ఐకాన్` అనే స్టార్ట‌ప్ కంపెనీ న‌డుం బిగించింది. కేవ‌లం రూ.2.6 ల‌క్ష‌ల వ్య‌యంతో 24 గంటల్లోపు ఇంటిని నిర్మించి ఇచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించింది.

అమెరికాకు చెందిన అలెక్స్ - జాస‌న్ - ఇవాన్ లు `ఐకాన్ ` అనే స్టార్ట‌ప్ కంపెనీని ప్రారంభించారు. 600-800 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో కేవ‌లం రూ.2.6 ల‌క్ష‌ల(4000 డాల‌ర్లు) ఖ‌ర్చుతో ఇంటిని నిర్మించేందుకు ముందుకు వ‌చ్చారు. ఒక లివింగ్ రూమ్ - ఒక బెడ్రూం - ఒక కిచెన్ ఉండే ఈ ఇల్లు ధృఢంగా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అందుకోసం వారు ఓ భారీ 3డీ ప్రింట‌ర్ ను రూపొందించారు. సిమెంట్ మిశ్ర‌మాన్ని ఉప‌యోగించుకుంటూ ఆ త్రీడీ ప్రింట‌ర్ ద్వారా ఇంటిని ప్రింట్ చేశారు. ఈ త‌ర‌హాలో టెక్సాస్ లో ప్ర‌యోగాత్మ‌కంగా ఓ ఇంటిని ప్రింట్ చేశారు. అతి త‌క్కువ క‌రెంటు - నీరు - ఉప‌యోగించుకొని ఈ ఇంటిని వారు రూపొందించారు. దీని ద్వారా నిర్మాణ కూలీల వ్య‌యంతో పాటు చాలా ఖ‌ర్చును నియంత్రించ‌వ‌చ్చ‌ని వారు తెలిపారు. మార్కెట్ లో ప్లాస్టిక్ తో త‌యారు చేసిన ఇళ్లు ఇప్ప‌టికే ల‌భిస్తున్నాయ‌ని, అయితే, త‌మ‌ది సిమెంటుతో త‌యారు చేసింద‌ని చెప్పారు. ఆ ఇళ్ల ఆకారానికి - త‌మ ఇళ్ల ఆకారానికి చాలా తేడా ఉంద‌న్నారు. ద‌క్షిణ అమెరికాలోని `న్యూ స్టోరీ` అనే స్వ‌చ్ఛంద సంస్థ సాయంతో వారు హైతి - బొలీవియాల్లో ఇప్ప‌టికే ఈ త‌ర‌హా ఇళ్ల‌ను నిర్మించారు. త్వ‌ర‌లోనే అమెరికాలో ఈ త‌ర‌హా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేప‌డ‌తామ‌ని అలెక్స్ - జాస‌న్ - ఇవాన్ లు తెలిపారు.