Begin typing your search above and press return to search.

హైదరాబాద్ పోలీస్ నే అడ్డుకున్న మజ్లిస్ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   7 Jan 2020 9:27 AM GMT
హైదరాబాద్ పోలీస్ నే అడ్డుకున్న మజ్లిస్ ఎమ్మెల్యే
X
హైదరాబాద్ లోని పాత బస్తీ తమ అడ్డా అని.. ఎవరూ ఏమీ చేయలేరంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తరచూ చెబుతుంటారు. ఆ మాటల్ని ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే మరోలా అర్థం చేసుకున్నట్లుంది. రాజకీయం గా పలుకుబడి ఉన్నంత మాత్రాన.. చట్టాన్ని శాసించటం లాంటివి చేయటం ఒక ఎత్తు అయితే.. అందుకు పోలీసులు వ్యవహరించిన శైలి మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివాదాలు మజ్లిస్ ప్రజా ప్రతినిధులకు కొత్తేం కాదు. ఎవరికి వారు తమకు తోచినట్లు వ్యవహరించటం.. వారిపై పోలీసులు సైతం చూసీ చూడనట్లుగా వ్యవహరించటం మొదట్నించి చూస్తున్నదే.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుందట. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావటమే కాదు.. పవర్ ఫుల్ హైదరాబాద్ పోలీసులు ఇలా వ్యవహరించటం ఏమిటంటూ పలువురు తప్పు పడుతున్నారు. ఇంతకూ జరిగిందేమంటే.. పాతబస్తీలోని శాలిబండలో కార్బెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఫలక్ నుమా ఏసీపీ మహ్మద్ మజీద్ విధి నిర్వహణ కోసం వచ్చారు.

ఆయన్ను మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ అడ్డుకున్నారు. దేశ వ్యాప్తంగా సీఏఏ మీద ఆందోళనలు జరుగుతున్న వేళ.. కార్బన్ సెర్చ్ నిర్వహించటం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో ఎప్పుడైనా.. ఎక్కడైనా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తనిఖీలు నిర్వహించటం తప్పు కాదు. కానీ.. అలా వచ్చిన వారిని అడ్డుకోవటం.. వెనక్కి తిరిగి పంపించటం అంటే.. పోలీసు విధి నిర్వహణను అడ్డుకున్నట్లే కదా? ఇలాంటి వాటిని హైదరాబాద్ పోలీసులు ఎందుకు ఉపేక్షించారు? అన్నది మరో ప్రశ్న.

ప్రజలంతా చూస్తున్న వేళ.. ఫలక్ నుమా ఏసీపీని చార్మినార్ ఎమ్మెల్యే అడ్డుకోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. మజ్లిస్ ఎమ్మెల్యే తీరు పోలీసులను అవమానించేలా ఉందని వారు మండిపడుతున్నారు. మజ్లిస్ నేత ఆగ్రహం తో పోలీసులు వెనక్కి తిరిగి వెళ్లారు. దీని పై పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా హైదరాబాద్ పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. తాజా పరిణామం తెలంగాణ పోలీసులకే తలవంపులు తెచ్చాయన్న వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన మజ్లిస్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. మరి.. హైదరాబాద్ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.