Begin typing your search above and press return to search.

కూల్చే వాళ్లకు ఉస్మానియా ఏంది?

By:  Tupaki Desk   |   1 Aug 2015 4:16 PM GMT
కూల్చే వాళ్లకు ఉస్మానియా ఏంది?
X
అపురూపం అన్న పదానికి అర్థం తెలీకుండా తెలంగాణ అధికారపక్షం నేతలు మాట్లాడేస్తున్నారు. డబ్బున్న అహంకారమో.. రాజకీయంగా తమకు తిరుగులేదన్న మితిమీరిన ఆత్మవిశ్వాసమో కానీ.. వారి చేత చిత్ర.. విచిత్రమైన ప్రకటనల్ని చేసేలా చేస్తోంది.

తాజాగా చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేతపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. ఆయన చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. శిథిలావస్థకు చేరితే.. చార్మినార్ అయినా కూల్చేయాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

చరిత్ర.. వారసత్వ సంపద మీద తెలంగాణ అధికారపక్షానికి ఉన్న మమకారం ఏమిటో.. తాజా వ్యాఖ్యతో ఇట్టే తెలిసిపోతుందని చెబుతున్నారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమా పాత భవనాలు ముఖ్యమా అని ప్రశ్నిస్తున్న ఆయన.. ఉస్మానియా ఆసుపత్రిని కూల్చటం ఏ మాత్రం తప్పు కాదని తేల్చేశారు. ఉస్మానియా ఆసుపత్రి స్థానంలో 10 అంతస్థుల ప్రపంచ స్థాయి ఆసుపత్రి నిర్మాణం చేపడతామని వ్యాఖ్యానించారు. కొత్తగా నిర్మించే భవనానికి ఉస్మానియా పేరే పెడతామని చెబుతున్నారు.

చూస్తుంటే పేర్ల మీదున్న మోజు.. కట్టడాల మీద కనిపించకపోవటం గమనార్హం. అయితే.. పురావస్తు సంపదను.. చారిత్రక సంపదను కేవలం భవనాలుగా మాత్రమే చూసే వారి నుంచి ఇంతకు మించిన వ్యాఖ్యానిస్తారని ఊహించటం కూడా తప్పేమో.

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. చరిత్రలో ప్రాముఖ్యం ఉన్న కట్టడాల గురించి అత్యంత నిర్లక్ష్యంగా.. బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయటం చూస్తుంటే.. పరిరక్షణ కంటే కూడా పడగొట్టటం మీదనే దృష్టి ఉన్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ మహానగరానికి ఐకాన్ గా చెప్పుకునే చార్మినార్ పడగొట్టటం అన్న మాటను ఊహించేందుకు కూడా ఎవరూ సాహసించరు. కానీ.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మాత్రం భావ రహితంగా చాలా సింఫుల్ గా.. చార్మినార్ ను అయినా కూల్చేస్తాం అని చెప్పేశారు. అయినా.. శిథిలావస్థకు వచ్చే వరకూ ఎందుకు చూస్తుండాలి. వాటిని పరిరక్షించాలన్న ధ్యాస ఎందుకు ఉండటం లేదన్నది కీలక విషయం. మరి.. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం ఎలా స్పందిస్తుందో..?