Begin typing your search above and press return to search.

చెక్‌ బౌన్స్‌ కేసులు ... కమిటీ వేసిన సుప్రీంకోర్టు !

By:  Tupaki Desk   |   11 March 2021 1:30 PM GMT
చెక్‌ బౌన్స్‌ కేసులు ... కమిటీ వేసిన సుప్రీంకోర్టు !
X
దేశంలోని పలు కోర్టుల్లో పేరుకుపోతున్న చెక్ ‌బౌన్స్‌ కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి సారించిన సుప్రీం కోర్టు, ఈ దిశలో బుధవారం కీలక చర్య తీసుకుంది. ఇందుకు సంబంధించి తగిన సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసింది. కమిటీకి బాంబే హైకోర్ట్‌ మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ సి చవాన్‌ నేతృత్వం వహిస్తారు. మూడు నెలల్లో కమిటీ తన సిఫారసులను సమర్పించాల్సి ఉంటుంది. భారీగా పేరుకుపోయిన నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రమెంట్‌ యాక్ట్‌ కేసుల కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటే సరైన మార్గమని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి ధర్మాసనం వెల్లడించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎల్‌ నాగేశ్వరరావు, బీఆర్‌ గవాయ్, ఏఎస్‌ బోపన్న, ఎస్‌ రవీంద్రభట్‌ లు ఉన్నారు.

కాగా, ఈ కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అత్యున్నత న్యాయస్ధానానికి తన వాదనలు వినిపిస్తూ, విధివిధానాలు ఖరారయిన తర్వాత రాజ్యాంగంలోని 247వ అధికరణ అనుగుణంగా చెక్ ‌బౌన్స్‌ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది అని తెలిపారు. కమిటీలో ఇతర సభ్యులుగా ఆర్థిక సేవల శాఖ అధికారి, న్యాయ, కార్పొరేట్‌ వ్యవహారాలు, వ్యయాలు, హోమ్‌ శాఖలకు చెందిన అధికారులు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా , ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ప్రతినిధి, సొలిసిటర్‌ జనరల్‌ లేదా ఆయన నామినీ కమిటీలో ఇతర సభ్యులుగా ఉంటారు. సిఫారసులను రూపొందించడంలో అవసరమైన సహాయ సహకారాలు అన్నింటినీ కేంద్రం అందించాల్సి ఉంటుంది.

చెక్‌ బౌన్స్‌లు వివిధ కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సూ మోటోగా ఈ కేసు గత ఏడాది విచారణకు చేపట్టింది. 2005కు ముందు ఒక కేసు విచారణ సందర్భంగా ఈ సమస్య అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనానికి సలహాలు ఇవ్వడానికి సీనియర్‌ అడ్వకేట్‌ సిద్ధార్థ్‌ లుథ్రా, అడ్వకేట్‌ కే. పరమేశ్వర్‌లు నియమితులయ్యారు. కేసులో ఇప్పటికే కేంద్రం, హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరల్, డీజీపీలు, నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌ సెక్రటరీ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ అయ్యాయి. ఈ అంశంపై సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటును బుధవారం ప్రతిపాదించింది. కమిటీలో సభ్యుల పేర్లను సూచించాలని కేంద్రాన్ని ఆదేశించింది.