Begin typing your search above and press return to search.

పార్టీ జెండా వాడకుండా చిన్నమ్మకు చెక్

By:  Tupaki Desk   |   5 Feb 2021 4:39 AM GMT
పార్టీ జెండా వాడకుండా చిన్నమ్మకు చెక్
X
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష అనుభవించి.. ఇటీవల విడుదలైన చిన్నమ్మ శశికళ.. బయటకు వస్తూనే అన్నాడీఎంకే అధినాయకత్వానికి షాకివ్వటం తెలిసిందే. జైలుశిక్ష అనుభవిస్తున్న వేళ.. కరోనా బారిన పడిన ఆమెను ఆసుపత్రికి తరలించటం.. అక్కడే ఆమె జైలుశిక్ష కాలం పూర్తి కావటంతో ఆమె రిలీజ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం ఆమె జైలు నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణించిన కారుకు అన్నాడీఎంకే జెండా ఉండటాన్ని పలువురు తప్పు పట్టారు.

దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. తమ పార్టీకి సంబంధం లేని శశికళ పార్టీ జెండా ఎలా వాడతారన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. ఈ అంశంతో అన్నాడీఎంకే నేతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తమ పార్టీకి చెందని వ్యక్తి.. పార్టీ జెండా వాడటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ పోలీసులకు కంప్లైంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫాంహౌస్ లో ఉంటున్న ఆమె.. ఈ నెల 8న చెన్నైకి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

తన అనుకూల వర్గాన్ని సమాయుత్తం చేస్తున్నారు. దీంతో.. ఆ సమయంలోనూ చిన్నమ్మ అన్నాడీఎంకే జెండాను వినియోగిస్తే.. సమస్యలు తప్పవన్న విషయాన్ని గుర్తించి.. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్నాడీఎంకే జెండాను చిన్నమ్మ వాడకుండా ఉండేందుకు తగిన ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.

ఇందులో భాగంగా పార్టీకి చెందిన అగ్రనేతలు మధుసూదనన్.. కేపీ మునుస్వామి.. వైద్య లింగం..పలువురు మంత్రులు రాష్ట్ర డీజీపీని కలిశారు. తమ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని శశికళ.. పార్టీ జెండా వినియోగించటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. పార్టీకి సంబంధం లేని వారు పార్టీ జెండా వాడటంపై చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నాడీఎంకే జెండాను అర్హత కలిగిన పార్టీ కార్యకర్తలు.. నేతలు మాత్రమే వాడాలన్నారు. పార్టీకి సంబంధం లేని వారు జెండాను ఉపయోగించటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఫామ్ హౌస్ నుంచి చెన్నైకి వచ్చే సమయంలో ఆమె అన్నాడీఎంకే జెండాను వాడకుండా చేయాలన్న అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి.. చిన్నమ్మ ఏం చేస్తారో చూడాలి.