Begin typing your search above and press return to search.

చెడ్డీ గ్యాంగ్‌ ని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు !

By:  Tupaki Desk   |   30 Dec 2019 9:32 AM GMT
చెడ్డీ గ్యాంగ్‌ ని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు !
X
చెడ్డీ గ్యాంగ్... ఈ పేరు వింటేనే ప్రజలకు ఎక్కడలేని భయం వస్తుంది. ఇంటికి తాళం వేసుంటే దొంగతనం, లేకుంటే కత్తులు , అలాగే మరికొన్ని మారణాయుధాలతో బెదిరించి చోరీ చేయడం. కేవలం చెడ్డీలు వేసుకుని, ఒళ్లంతా నూనె రాసుకుని, నలుగురు నుంచి ఆరుగురు సభ్యుల ఒక ముఠాగా రాత్రుళ్లు, నగర శివారు ప్రాంతాల్లోని కాలనీ వీధుల్లో తిరుగుతూ, కనిపించిన ఇంట్లోకి జొరబడి దొంగతనాలకు పాల్పడటమే వీరి వృత్తి. గడచిన నెల రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ పరిధి లో ఆరు చోట్ల దోపిడీలకు పాల్పడి, హైదరాబాద్ పోలీసులకు నిద్రలేని రాత్రులను మిగల్చడంతో పాటు, తమను పట్టుకోవాలంటూ సవాల్ విసిరిని చెడ్డీగ్యాంగ్ ఆటను ఎట్టకేలకి రాచకొండ పోలీసులు కట్టించారు.

ముఖ్యంగా ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని రాత్రివేళ్లలో ఈ చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. రెండు నెలల క్రితం కుంట్లూరు నగర పంచాయతీ లో ఒకేరాత్రి మూడిళ్ల లో చోరీ చేసారు. దీంతో అక్కడి ప్రజలు ఏ రాత్రి ఏమి జరుగుతుందో అని భయంతో వణికిపోతున్నారు. హయత్‌నగర్‌ లో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి వ్యక్తిని నిర్బంధించి డబ్బు, బంగారం ఎత్తుకెళ్లారు. చెడ్డీగ్యాంగ్ కోసం పోలీసులు ఎంతలా ప్రయత్నించినా పట్టుకో లేకపోవడంతో అనేక విమర్శలు వచ్చాయి.

దీనితో ఈ చెడ్డీ గ్యాంగ్ ని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసాయి. దాదాపుగా నెల రోజులుగా వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టి ..హయత్ నగర్ సమీపంలో చెడ్డీ గ్యాంగ్ బృందాన్ని అరెస్ట్ చేయగలిగారు. మొత్తం ఏడుగురు సభ్యుల బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడుగురు ముఠా సభ్యుల నుంచి 150 గ్రాముల బంగారం, రూ.3వేలు నగదు,నాలుగు వందల గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగర వాసులకు, పోలీసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.