Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఓకే.. బాబు నాట్ ఓకే ఏంటి జోగ‌య్య‌?

By:  Tupaki Desk   |   24 Feb 2016 6:38 AM GMT
కేసీఆర్ ఓకే.. బాబు నాట్ ఓకే ఏంటి జోగ‌య్య‌?
X
రెండు రాష్ట్రాల‌కు చెందిన చంద్రుళ్లు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను జోరుగా సాగిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ‌లో తెలుగుదేశం మీద గురి పెట్టిన తెలంగాణ స‌ర్కారు అధినేత కేసీఆర్‌.. ఆ పార్టీని కోలుకోకుండా చేసి.. చివ‌ర‌కంటా ఏమీ లేకుండా చేసిన ప‌రిస్థితి. మిగిలిన న‌లుగురైదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా ఒక‌టేన‌న్న ప‌రిస్థితికి టీడీపీని తీసుకొచ్చారు. ఒక‌ప్పుడు తెలంగాణ‌లో బ‌ల‌మైన పార్టీగా ఉన్న టీడీపీ ఈ రోజు ద‌య‌నీయ స్థితిలో ఏం చేయాలో అర్థం కాక కిందామీదా ప‌డుతుంటే.. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు త‌న దృష్టిని తెలంగాణ కాంగ్రెస్ మీద పెట్టిన‌ట్లు చెబుతున్నారు.

ఓవైపు తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మ‌హా జోరుగా సాగుతుంటే.. ఇంకోవైపు ఏపీలో అధికార‌ప‌క్ష అధినేత చంద్ర‌బాబు త‌న ఆక‌ర్ష్‌ ను షురూ చేశారు. ఏపీ విప‌క్షానికి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేల‌ను ఒక్క‌సారిగా సైకిల్ ఎక్కించిన ఆయ‌న‌.. రానున్న రోజుల్లో మ‌రింత‌మందిని సైకిల్ ఎక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వ్య‌వ‌హారంపై సీనియ‌ర్ రాజ‌కీయ నేత.. మాజీ ఎంపీ చేగొండి హ‌రిరామ‌జోగ‌య్య రియాక్ట్ అయ్యారు. రాజ్యాంగ సూత్రాల్ని.. నైతిక విలువ‌ల్ని ప‌క్క‌న పెట్టేసి ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల వ‌ల‌స‌ల్ని ప్రోత్స‌హించ‌టంతో టీడీపీ బ‌ల‌ప‌డుతుంద‌ని అనుకోవ‌టం వ‌ట్టి భ్ర‌మ‌గా తేల్చేసిన చేగొండి రాజ‌కీయ వ‌ల‌స‌ల‌పై విశ్లేష‌ణ అంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో అధికార‌ప‌క్షం ప్రోత్స‌హిస్తున్న వ‌ల‌స‌లు మంచి ఫ‌లితాలు ఇచ్చిన‌ట్లుగా చెప్పిన ఆయ‌న‌.. ఏపీలో మంచి ఫ‌లితాలు ఇవ్వ‌టం లేద‌ని చెప్ప‌టం విశేషం.

ఒక రాష్ట్రంలో మంచి ఫ‌లితం ఇచ్చిన అంశం.. ఇంకో రాష్ట్రంలో ఎందుకు మంచి ఫ‌లితం ఇవ్వ‌టం లేద‌న్న విష‌యంపై పెద్ద‌గా వివ‌ర‌ణ ఇవ్వ‌ని ఆయ‌న‌.. కేసీఆర్ ఆక‌ర్ష్ కు ఫ‌స్ట్ క్లాస్ మార్కులు వేసి.. బాబుకు మాత్రం పాస్ మార్కులు వేయ‌పోవ‌టం ఏమిటో..? జోగ‌య్య‌కే అర్థం కావాలి.