Begin typing your search above and press return to search.

తెలుగు సీఎంలకు రేటింగ్ ఇచ్చిన సీనియర్ నేత

By:  Tupaki Desk   |   2 Nov 2015 6:01 AM GMT
తెలుగు సీఎంలకు రేటింగ్ ఇచ్చిన సీనియర్ నేత
X
రాజకీయాల్లో తల పండిన నేతలు చాలామందే ఉన్నా.. ఎవరూ చేయని ఒక చిత్రమైన పనిని చేసి వార్తల్లోకి వచ్చారు సీనియర్ నేత చేగొండి హరిరామ జోగయ్య. తాజాగా పుస్తకం రాసిన ఆయన తెలుగు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారికి సంబంధించి రేటింగ్ ఇచ్చారు. ఎవరు ఎక్కువ నిజాయితీపరులు.. ఎవరు తక్కువ నిజాయితీపరులు అన్న విషయాన్ని కూడా తేల్చారు.

ఆయన పుస్తకంలో ఇచ్చిన రేటింగ్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రులకు ఇచ్చిన రేటింగ్ చూసినప్పుడు.. ఎలాంటి మొహమాటాలకు తావు లేని విధంగా హరి రామయ్య జోగయ్య వ్యవహరించినట్లుగా కనిపిస్తుందన్న మాట వినిపిస్తోంది. తన పుస్తకంలో అత్యుత్తమ నిజాయితీపరుడిగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన స్వర్గీయ ఎన్టీఆర్ కు ఇవ్వగా.. చివరి ప్లేసులో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇవ్వటం గమనార్హం.

ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ కు 90 శాతం మార్కులు ఇస్తే.. వైఎస్ కు మాత్రం 20 శాతం మాత్రమే ఇచ్చారు. వైఎస్ హయాంలో సంక్షేమ పథకాలతో ఆకట్టుకొని వేలాది కోట్ల రూపాయిల దోపిడీ జరిగిందని తేల్చారు. ఇక.. చంద్రబాబునాయుడికి 70 శాతం.. కోట్ల విజయభాస్కర్ రెడ్డికి.. జలగం వెంగళరావు.. కాసు బ్రహ్మానందరెడ్డి.. రోశయ్యలకు 60 శాతం చొప్పున రేటింగ్ ఇచ్చారు.

అతి తక్కువ నిజయితీపరుడన్న మచ్చను వేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంకు ఉన్న ప్రత్యేకతను కూడా తన పుస్తకం ద్వారా వెల్లడించారు. ముఖ్యమంత్రులు ప్రవేశ పెట్టిన పథకాల అమలులో ఎవరు ఎంత మేర అమలు చేయగలిగారన్న విషయంలో మాత్రం మిగిలిన అందరి కంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధమ స్థానంలో ఉండటం విశేషం. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు 90 శాతం అమలు అయినట్లుగా తేల్చారు. ఆయన తర్వాత స్థానం ఎన్టీఆర్ కు దక్కటం గమనార్హం. ఎన్టీఆర్ హయాంలో ప్రవేశ పెట్టిన పథకాల్లో 85 శాతం మాత్రమే అమలైనట్లుగా తేల్చారు.

ఇక.. పరిపాలన సమర్థతకు సంబంధించిన రేటింగ్ ను కూడా హరి రామ జోగయ్య ఇచ్చారు. పరిపాలనలో తిరుగులేని అధిక్యతను చంద్రబాబునాయుడు సొంతం చేసుకున్నారు. ఆయనకు 85 శాతం మార్కులు ఇవ్వటం విశేషం. కొసమెరుపేమంటే.. తన పుస్తకంలో అతి తక్కువ నిజాయితీ ఉన్న ముఖ్యమంత్రిగా వైఎస్ కు ఇచ్చిన ఆయన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం. అయితే.. 2014 మార్చిలో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అన్న విషయాన్ని చెప్పిన వైఎస్ కుటుంబానికి చెందిన పార్టీలో హరిరామ జోగయ్య ఎందుకు చేరినట్లో..?