Begin typing your search above and press return to search.

షాక్: విశాఖలో కెమికల్ లీక్.. ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి

By:  Tupaki Desk   |   7 May 2020 3:30 AM GMT
షాక్: విశాఖలో కెమికల్ లీక్.. ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి
X
ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏపీలోని ఉక్కునగరం విశాఖలోని ప్రజలకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఎప్పటిలానే గురువారం ఉదయం నిద్ర లేవక ముందే.. ఏదో తెలీని ఇబ్బంది. ఉన్నట్లుండి ఊపిరి తీసుకోలేకపోవటం.. చర్మం మీద పొక్కులతో పాటు.. తల పట్టేసినట్లు అయ్యింది. వేలాది మందికి ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఏమైందో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదమే. ఈ పరిశ్రమ నుంచి రసాయన వాయివు లీకైంది. ఇది కాస్తా మూడు కిలోమీటర్ల మేర విస్తరించింది. దీంతో.. పలువురి చర్మం మీద దద్దుర్లు.. కళ్లలో మంటలు.. శ్వాస తీసుకోవటం కష్టంగా మారటమే కాదు.. ఏం చేయాలో పాలుపోక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోడ్డు మీద అపస్మారక స్థితిలో పడిపోయిన వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇళ్లల్లో ఉన్న ప్రజలు తలుపులు వేసుకొని లోపలే ఉండిపోతున్నారు. .

ఇదిలా ఉంటే.. రసాయనం లీకైన నేపథ్యంలో దాని ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సైరన్లు మోగించి.. ఇళ్లను ఖాళీ చేయించాలంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రసాయన వాయువు విస్తరించిన ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో మహిళలు.. చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. జిల్లా కలెక్టర్.. ఎస్పీలు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రసాయిన వాయువు లీకును సరిదిద్దేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.