Begin typing your search above and press return to search.

రేసింగ్ చాంపియన్ నే చంపేసిన యాక్సిడెంట్

By:  Tupaki Desk   |   18 March 2017 8:53 AM GMT
రేసింగ్ చాంపియన్ నే చంపేసిన యాక్సిడెంట్
X
ఇండియన్ ఎఫ్-4 రేసర్ అశ్విన్ సుందర్ కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. తన భార్య నివేదితతో కలసి ఆయన ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు ప్రమాదానికి గురై మంటలు చెలరేగడంతో ఇద్దరూ అందులోనే దహనమైపోయారు. చెన్నై సమీపంలోని శాంతం హైరోడ్డులో రోడ్డు పక్కనున్న చెట్టును కారు ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని పోలీసులు చెబుతున్నారు.

అయితే.. అశ్విన్ సుందర్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రొఫెషనల్ కార్ రేసర్ కావడం... పైగా వారు ప్రయాణిస్తున్నది బీఎండబ్ల్యూ కారు కావడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రీమియం కార్లు ప్రమాదాలకు గురైన సంఘటనలు భారత్ లో చాలా తక్కువ. ఒకవేళ ప్రమాదానికి గురైనా సాధారణ కార్ల మాదిరిగా మంటలు వ్యాపించడం వంటివీ చాలా అరుదు. పైగా ఇలాంటి హై ఎండ్ కారును నడుపుతున్నది సాధారణ వ్యక్తి కాదు.. ప్రొఫెషనల్ రేసర్. దాంతో ఎందుకిలా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ రోడ్లపై మితిమీరిన వేగంతో వెళ్లడమే కొంపముంచందని భావిస్తున్నారు.

అశ్విన్ సుందర్ 1985 జూలై 27 న చెన్నైలో జన్మించారు. 2003లో ఎంఆర్ఎఫ్ ఫార్ములా మోండియల్ నేషనల్ ఛాంపియన్ షిప్ ను తొలిసారి గెలుచుకున్నారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎఫ్4 నేషనల్ ఛాంపియన్ గా అవతరించారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సైతం అశ్విన్ ప్రతిభను కనబరిచారు. 14 ఏళ్లకే ఈ రంగంలో అడుగుపెట్టిన ఆయన ప్రస్తుతం జర్మనీకి చెందిన రేసింగ్ టీం మా కాన్ మోటార్ స్పోర్ట్స్ లో సభ్యుడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/