Begin typing your search above and press return to search.

చెన్నైలో చిత్ర‌మైన క‌ష్టాలు

By:  Tupaki Desk   |   29 Dec 2015 9:55 AM GMT
చెన్నైలో చిత్ర‌మైన క‌ష్టాలు
X
చెన్నై వ‌ర‌ద‌....ఈ ఏడాది జ‌రిగిన అత్యంత పెద్ద విషాదం. దాదాపు ప‌దిరోజుల పాటు చెన్న‌ప‌ట్ట‌ణం వాసులు న‌రకం అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యక్షంగా అనుభ‌వించాన‌టం అతిశ‌యోక్తి కాదు. వ‌ర‌ద-వ‌ర్షాల తాలుకు ప్ర‌భావం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ప్ప‌టికీ ఇపుడు చెన్నై వాసుల‌కు కొత్త క‌ష్టం ఖ‌చ్చితంగా చెప్పాలంటే వింత క‌ష్టం ఎదురువుతోంది.

కనీవినీ ఎరుగని వరదలు కార్లను ముంచేసి నీళ్ళలో నాన్చేశాయి. రోజుల తరబడి కార్లు అలాగే ఉండిపోవడంతో వాహనాలు స్టార్ట్‌ చేయడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. ఇలా చెన్నైలో లక్షకార్ల వరకు రిపేర్‌ చేయాల్సినవి ఉన్నాయి. దీంతో చెన్నైలో నిండా మునిగిపోయిన కార్ల సంగతేంటనే సందేహంలో అనేక మంది ప్ర‌జానికం ఉండిపోయారు. ఆల్టో నుంచి ఆడి దాకా....ఇయాన్‌ నుంచి ఎండీవర్‌ దాకా.... బ్రాండ్‌ తో పని లేదు, రేంజ్‌ మాట అసలే లేదు. అన్ని కార్లు షెడ్‌లోనే. దీంతో చెన్నైలో ఆటోమొబైల్‌ టెక్నీషియన్స్‌ ఇప్పుడు చాలా బిజీ. ఇంకా చెప్పాలంటే 24 గంటలూ చేసినా - టైమ్‌ సరిపోవడం లేదు. టెక్నాలజీని బాగా వాడే వర్క్‌ షాప్స్‌ లో సైతం రోజుకు 40 నుంచి 50 కార్లకు మించి సర్వీసింగ్‌ చేయలేరు. ఆ లెక్కన ఇప్పడు మునిగిపోయిన కార్లన్నిటినీ రోడ్డెక్కించడానికి ఎన్ని నెలలు పడుతుందో అంచనా వేయలేకపోతున్నారు. డిమాండ్‌ ను తట్టుకోవడానికి దాదాపు అన్ని కంపెనీలు ఊరి చివరన సర్వీస్‌ మేళా పెడుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో టెక్నీషియన్స్‌ ని రప్పించి మూడు షిఫ్ట్‌ లు పని చేయిస్తున్నాయి. ఈ మేళాకు రోజుకు వెయ్యి దాకా వాహనాలు వస్తున్నాయి.

అయితే అన్నిటికి ఒకేచోట రిపేర్‌ చేయాలంటే కష్టం గనుక కారు నీళ్ళలో మునిగిన స్థాయిని బట్టి మూడు భాగాలుగా విభజిస్తున్నారు. కారు ఎంత వరకు మునిగింది, ఎన్ని రోజులు మునిగిందన్న వివరాలను ఫోన్‌ లో చెబితే దాని ప్రకారం అంచనా వేసి ఎక్కడికి తీసుకురావాలో చెబుతున్నారు. ఆ ప్రకారం వెళ్ళినా రోజుల తరబడి వెయిటింగ్‌ ఉంటోంది. వచ్చే నెల రోజుల వరకు బుకింగ్స్‌ అయిపోవడంతో ఇప్పుడు ఏదైనా కారును రిపేర్‌ కు తీసుకు వస్తామని ఫోన్‌ చేస్తే అవతలి నుంచి నెల రోజుల తర్వాత రమ్మన్న సమాధానం వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఇన్సురెన్స్ కంపెనీలు ఆవేదన మ‌రో ర‌కంగా ఉంది. బీమా కంపెనీల‌కు చెందిన పెద్ద‌ల ఆవేద‌న వ‌ర్ణ‌తాతీతం. షోరూమ్స్‌ - షెడ్స్‌ దగ్గర పరిస్థితి ఎలా ఉంది, జరిగిన నష్టమెంత? క్లెయిమ్స్‌ అన్నిటినీ పరిష్కరిస్తే ఎన్నివేల కోట్ల రూపాయల భారం పడుతుంది? అంటూ ఇన్సూరెన్స్‌ కంపెనీల అధిప‌తులు ఆరా తీయ‌డంలో ప‌డిపోయారు.

ఈ క్ర‌మంలోనే వారు తాత్కాలిక ప‌రిష్కారం ఆలోచించారు. కంపెనీ, కారు రేంజ్‌ని బట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటికి రిపేర్‌ చేయాలంటే రెండు నుంచి 15 లక్షల రూపాయల దాకా దాకా ఖర్చవుతోంది. అంత పెట్టడం ఎందుకనుకుంటున్న కొంతమంది ఎక్స్చేంజ్‌ ఆఫర్స్‌కు వెళ్తున్నారు. ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా బయటి నుంచి సిబ్బందిని రప్పించుకుని ఎస్టిమేట్స్‌ వేయిస్తున్నా.. ఎంతకీ తరగడం లేదు. దానికితోడు ఒకేసారి క్లెయిమ్స్‌ అన్నీ మీద పడితే తట్టుకోవడం కష్టం గనుక వీలైనంత జాప్యం చేసే ప్రయత్నంలో ఉన్నాయి. దశలవారీగా సెటిల్‌ చేస్తున్నాయి. దీంతో తమదాకా వచ్చేసరికి ఏం కొర్రీలు పెడతారోనని కొంతమంది కస్టమర్స్‌ టెన్షన్‌ పడుతున్నారు.

మొత్తం మీద ఇప్పుడున్న లెక్క ప్రకారం తీసుకున్నా... చెన్నైలో ఉన్న కార్లన్నీ రిపేరై రోడ్డెక్కడానికి ఎంత లేదన్నా ఇంకో నాలుగు నెలలు పడుతుందన్నది సీనియర్‌ టెక్నీషియన్స్‌ మాట. కార్లే ఇలా ఉంటే ఇక టూ వీలర్స్‌ పరిస్థితి ఇంతా ఘోరంగా ఉంది. దీంతో ఏ ఏరియాకు ఆ ఏరియాలో సర్వీస్‌ సెంటర్స్‌ పెట్టి, బయటి మెకానిక్స్ సేవ‌ల‌ను కంపెనీలు ఉప‌యోగించుకుంటున్నాయి.