Begin typing your search above and press return to search.

హోమాలతో రంగంలోకి దిగిన వైద్యులు!

By:  Tupaki Desk   |   17 Oct 2016 7:13 AM GMT
హోమాలతో రంగంలోకి దిగిన వైద్యులు!
X
చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అభిమానులు - అన్నాడీఎంకే కార్యకర్తలు - ఇంకా గట్టిగా మాట్లాడితే యావత్ తమిళ ప్రజలు ఆందోళన చెందుతున్న క్రమంలో వారికున్న ఆశంతా వైద్యుల పైనే! ఎవరికి అనారోగ్యం వచ్చినా ఆ సమయంలో వైద్యుడే నారయణుడు. అయితే ఈ విషయంలో తమిళనాడు వైద్యులు మాత్రం నారాయణుడినే వేడుకుంటున్నారు! తాజాగా తమిళనాడుకు చెందిన వందమంది వైద్యులు జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని, అనారోగ్యం నుంచి కోలుకోవాలని వేడుకుంటూ తురువళ్లూరులోని వైద్య వీరరాఘవ పెరుమాళ్ ఆలయంలో హోమాలు నిర్వహించారు. తమను మించిన అతీంద్రీయ శక్తి అమ్మను కాపాడాలంటూ ప్రార్ధనలు జరిపారు!

పండితులు చేసిన వేద మంత్రోచ్చారణలతో వీరరాఘవ స్వామి ఆలయం మారుమ్రోగిపోయింది. ఈ హోమాల్లో వైద్యులతో పాటు అన్నాడీఎంకే కి చెందిన పలువురు నేతలు - అమ్మ అభిమానులు పాల్గొన్నారు. వారంతా అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని - తొందర్లోనే కోలుకోవాలని స్వామివారిని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మృత్యుంజయ హోమం - మహాసుదర్శన హోమం - ఆయుష్షు హోమం ఇలా మొదలైన హోమాలు జరిగాయి.

వైద్యులు దేవుడిని పూజించకూడదా.. అనారోగ్యంపై నారాయణుడికి అర్జీ పెట్టుకోకూడదా.. వంటి ప్రశ్నలు పక్కనపెడితే అనారోగ్యానికి చికిత్స అందించేంది వైద్యులే అయినా, అంతకు మించిన అతీంద్రీయ శక్తి వుందని, అందుకే ఆ శక్తి అమ్మను కాపాడాలని భగవంతుడ్ని వేడుకున్నామని హోమం అనంతరం వైద్యులు చెప్పారు!! ఇదే సమయంలో రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ తమ వంతుగా ముఖ్యమంత్రి కోసం ప్రార్థనలు చేయాలని పిలుపునిస్తున్నారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/