Begin typing your search above and press return to search.

హెల్మెట్ పెట్టుకొని వణికిస్తున్న పోలీసు ఆఫీసర్

By:  Tupaki Desk   |   29 March 2020 12:30 AM GMT
హెల్మెట్ పెట్టుకొని వణికిస్తున్న పోలీసు ఆఫీసర్
X
ఎంత చెప్పినా వినకుండా.. అవసరం లేకున్నా రోడ్ల మీదకు వస్తున్న వారిపై తమిళనాడుకు చెందిన పోలీసు అధికారి ఒకరు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు..సమస్య తీవ్రత ఎంతన్నది అర్థమయ్యేలా చేస్తోంది. దేశమంతా లాక్ డౌన్ విధించిన వేళ.. ఎంతో అవసరం ఉంటే తప్పించి ఇంట్లో నుంచి బయటకు రాకూడదన్న వినతిని వదిలేసి.. అదే పనిగా వస్తున్నారు. అలాంటి వారిపై చాలాచోట్ల పోలీసులు లాఠీలు ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

ఇలాంటివేళ.. తమిళనాడుకు చెందిన ఒక పోలీసు అధికారి వినూత్నంగా ఆలోచించారు. లాఠీలకు పని చెప్పకుండానే.. అంతకు మించి భయం కలిగేలా ప్లాన్ చేశారు. హెల్మెట్ కు కరోనా వైరస్ మాదిరి డిజైన్ చేశారు. వైరస్ తో ఎంత ముప్పు ఉంటుందన్న విషయాన్ని చూసినంతనే అర్థమయ్యేలా రూపొందించారు. దాన్ని ధరించి.. రోడ్ల మీదకు అవసరం లేకున్నా వస్తున్న వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

కరోనా వైరస్ తో ఎంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని చెబుతూ వైరస్ మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు..వాహనం మీద హెల్మెట్ పెట్టుకోవటం ద్వారా కళ్లు.. ముక్కు.. నోరు.. చెవుల్ని మూసివేస్తుందని.. మనం చేతులతో టచ్ చేసే అవకాశం కూడా ఉందన్న విషయాన్ని చెబుతున్నారు. లాఠీలతో చితక్కొట్టే కన్నా.. ఇలాంటి పనులతో మరింత మేలు ఉంటుందంటున్నారు.