Begin typing your search above and press return to search.

చిన్నమ్మను ఛీ కొడుతున్న ఆర్కే నగర్ వాసులు

By:  Tupaki Desk   |   6 Jan 2017 6:33 AM GMT
చిన్నమ్మను ఛీ కొడుతున్న ఆర్కే నగర్ వాసులు
X
అమ్మ తర్వాత చిన్నమ్మే అని తేలిపోయింది. అమ్మ ముందు ఏ విధంగా అయితే వినయ విధేయుతల్ని ప్రదర్శిస్తారో.. అంతకు ఏ మాత్రం తగ్గని రీతిలోనే వ్యవహరిస్తున్నారు అన్నాడీఎంకే నేతలు. అమ్మ తర్వాత పార్టీ పగ్గాల్ని స్వీకరించేందుకు అవసరమైన గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకొని.. దర్జాగా అన్నాడీఎంకే చీఫ్ గా అవతరించిన ఆమె.. రానున్న రోజుల్లో సీఎం కుర్చీనే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక.. ఆమె ధాటికి తట్టుకునే వారెవరూ అన్నాడీఎంకే పార్టీలో లేరన్నట్లుగా పరిస్థితి కనిపిస్తున్న వేళ.. చిన్నమ్మకు భారీ షాక్ తగిలేలాంటి ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. అమ్మ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి ఆమె ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్న వేళ.. అలాంటిదే జరిగితే చిన్నమ్మకు తాము ఓటు వేసేదే లేదని ఓపెన్ గా తెగేసి చెబుతున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. ‘‘ఆమెను ఆశలు పెట్టుకోవద్దని చెప్పండి. ఆమె గురించి ఆమె పెద్దగా ఊహించుకోవద్దు. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఓట్లు అడగొద్దు. మేం ఇక్కడ ఉన్నామంటే అది అమ్మ కోసమే’’ అంటూ ఆర్కేనగర వాసులు తేల్చిచెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అమ్మ ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఎక్కువమంది ఓటర్లు ఇదే తీరులో రియాక్ట్ కావటం.. చిన్నమ్మ పోటీ చేస్తే ఓట్లు వేసేది లేదంటూ ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ‘‘ఇది జయమ్మ చోటు. ఇక్కడ శశికళకు చోటు లేదు. మా అమ్మ 77 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. ఒక్కరోజైనా ఆమెను మాకు శశికళ చూపించారా? జయ మేనకోడలు దీపా మాత్రమే మా దగ్గర పోటీ చేయాలి. అమ్మ వారసత్వం ఆమె మాత్రమే కొనసాగించాలి’’ అంటున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆర్కే నగర్ నుంచి చిన్నమ్మ బరిలో దిగటాన్ని నిరసిస్తున్న ఆర్కే నగర్ వాసుల తీరుతో.. శశికళను మరో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించేలా ఏర్పాట్లు చేసుకుంటే మంచిదన్న అభిప్రాయం పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఏమైనా.. ఆర్కేనగర్ ప్రజలు చిన్నమ్మ మీద పెంచుకున్న తీవ్ర వ్యతిరేకత ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/