Begin typing your search above and press return to search.

చెన్నై స్పీడుకి ఎదురుందా..నేడు రాజస్థాన్ తో సమరం

By:  Tupaki Desk   |   22 Sep 2020 2:00 PM GMT
చెన్నై స్పీడుకి ఎదురుందా..నేడు  రాజస్థాన్ తో సమరం
X
ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఇవాళ ఐపీఎల్ లోనే అత్యంత సక్సెస్ రేట్ కలిగిన ఇద్దరు సీనియర్ కెప్టెన్లు తలపడనున్నారు. షార్జా వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ లో అత్యధిక విజయాలు, అత్యధిక ట్రోఫీలు సాధించిన చెన్నై మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించి మంచి ఊపు మీద ఉండగా, ఐపీఎల్ లోనే అండర్ డాగ్ గా బరిలోకి దిగి అంచనాలకు మించి రాణించడం రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేకత.అయితే కొన్నేళ్లుగా ఆ జట్టు ఆరు, ఏడు స్థానాలకే పరిమితం అవుతోంది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో మరోసారి రాజస్థాన్ తన అదృష్టాన్ని పరీక్షించు కోనుంది. యువకులు, సీనియర్ల కలబోతతో రాజస్థాన్ వైవిధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఐపీఎల్ లో చెన్నై, రాజస్థాన్ జట్లు 21 సార్లు తలపడగా చెన్నై 14 సార్లు విజయాలు సాధించగా, రాజస్థాన్ 7 సార్లు విజయకేతనం ఎగురవేసింది. చెన్నై కి కీలక ఆటగాడు అయినా బ్రేవో గాయంతో దూరం కావడం కాస్త దెబ్బే అయినా రెండు జట్లతో పోలిస్తే చెన్నై జట్టే బలంగా కనిపిస్తోంది.

పిచ్ రిపోర్ట్
షార్జా స్టేడియం బ్యాట్స్మెన్ లకు స్వర్గధామమే. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దుబాయ్ అబుదాబి లతో పోలిస్తే షార్జా పిచ్ వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడ బౌలర్లకు కష్టాలు తప్పదు. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.


బ్యాటింగ్ దుర్భేద్యంగా చెన్నై

సీఎస్కే బలం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూల్ గా ఉండే ధోనీ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ జట్టులో అందరూ సీనియర్ ఆటగాళ్లే. ఐపీఎల్లో విశేష అనుభవం వారి సొంతం. వాట్సన్, డుప్లెసిస్ తో పాటు రాయుడు ఫామ్ సాధించడంతో ఆ జట్టు బ్యాటింగ్ లో బలంగా ఉంది. జడేజా, ఎంగిడి, దీపక్ చాహర్ తో బౌలింగ్ లోనూ చెన్నై బలంగా కనిపిస్తోంది.

జట్టు(అంచనా) : మురళీ విజయ్, షేన్ వాట్సన్, డుప్లెసిస్, రాయుడు, జాదవ్, ధోని(కెప్టెన్), జడేజా, సామ్ కరన్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, ఎంగిడి

వైవిధ్యం రాజస్థాన్ సొంతం

కెప్టెన్ స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ అదనపు బలం కానుంది. చెన్నై తో పోలిస్తే రాజస్థాన్ బౌలింగ్ దళం వైవిధ్యంగా కనిపిస్తోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్ ఆర్చర్ తో పాటు ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ చెలరేగితే చెన్నైకి కష్టాలు తప్పవు. కీలక ఆటగాడు బట్లర్ క్వారంటైన్ నిబంధనలతో దూరం కాగా ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఇంకా జట్టులోకి చేరలేదు.ఆ ఇద్దరికీ బదులుగా టామ్ కరణ్, డేవిడ్ మిల్లర్లకు ఛాన్స్ దొరకనుంది. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ రాణించాలని జట్టు కోరుకుంటోంది.

జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, ఉతప్ప, స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, సంజూ శాంసన్, టామ్ కరన్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, ఆర్చర్, ఉనద్కట్, రాజపూత్/వరుణ్ ఆరోన్/కార్తీక్ త్యాగి