Begin typing your search above and press return to search.

జెండాకు నిప్పు; ఇలాంటోడ్ని ఏం చేయాలి?

By:  Tupaki Desk   |   2 Feb 2016 10:40 AM IST
జెండాకు నిప్పు; ఇలాంటోడ్ని ఏం చేయాలి?
X
ప్రచారం కోసం చేశాడో.. లేదంటే కండ కావరంతో చేశాడో కానీ పూర్తిగా హద్దులు దాటేసిన తమిళనాడుకు చెందిన ఒక యువకుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ దేశానికి ఎలాంటి ముప్పు వాటిల్ల కూడదని.. జాతీయ జెండా స్వేచ్ఛగా రెపరెపలాడుతూ ఉండాలని ఓపక్క సరిహద్దుల్లో సైనికులు కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతుంటే.. దేశాభివృద్ధి కోసం కృషి చేసి.. అందరికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక యువకుడి దుశ్చర్యను చూస్తే ఎవరికైనా ఒళ్లు మండక మానదు.

అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాతో తమకున్న వికారాల్ని ప్రదర్శిస్తున్న కొందరి కోవలో ఈ తమిళన యువకుడు చేరతాడు. కారణం తెలీదు కానీ.. జాతీయజెండాను తగలబెడుతూ.. ఆ దృశ్యాల్ని వాట్సప్ లో పోస్ట్ చేశాడు. ఈ యువకుడ్ని దిలీప్ గా గుర్తించారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న దిలీప్ అనే యువకుడిది నాగపట్నం జిల్లా నల్లూరు సౌత్ పోయగై అల్వార్ ప్రాంతం. చెన్నైలో ఉంటున్న ఇతగాడు జాతీయ జెండాను కాలుస్తూ దానికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన హిందూ మక్కల్ మున్న పార్టీకి చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో జాతీయ జెండాను అవమానించిన కేసును ఈ యువకుడి మీద పెట్టి అతడి కోసం గాలిస్తున్నాడు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వాడిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా స్పందిస్తున్నారు.