Begin typing your search above and press return to search.

రీల్ హీరో కాదు రియల్ హీరో చెప్పిన సంచలన మాట

By:  Tupaki Desk   |   21 July 2022 6:30 AM GMT
రీల్ హీరో కాదు రియల్ హీరో చెప్పిన సంచలన మాట
X
రీల్ లో హీరోలు చాలానే చేస్తుంటారు. చాలావరకు వాస్తవంలో సాధ్యమే కావు. కానీ..రియల్ గా ఒక దిగ్గజ క్రీడాకారుడి నోటి నుంచి వచ్చిన మాట.. తీసుకున్న షాకింగ్ నిర్ణయం సినిమాల్లో తెంపరి హీరో పాత్రధారి కూడా చేయలేదేమో. అలాంటి సంచలన నిర్ణయాన్ని తీసుకున్న అతగాడి మాటలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గెలుపు మనిషిని మరింత ఉత్తేజితం చేయటమే కాదు.. దాని కోసం తపించిపోయేలా చేస్తుంది. ఆ గెలుపును సొంతం చేసుకోవటానికి పడే ఆరాటం అంతా ఇంతా కాదు. అలాంటిది ఆ గెలుపు బోర్ కొట్టేసిందన్న దిగ్గజ క్రీడాకారుడి మాట ఇప్పుడు ఒక పట్టాన జీర్ణించుకోలేనట్లుగా మారింది.

చదరంగంలో అత్యున్నత టోర్నీగా అభివర్ణించే ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనడటమే పెద్ద గౌరవంగా భావిస్తారు. ఇక.. అందులో గెలిస్తే.. ప్రపంచాన్నే గెలిచిన ఫీలింగ్. మిగిలిన ఆటలకు బిన్నంగా.. మైండ్ గేమ్ తో గెలిచే ఈ గెలుపు.. సదరు వ్యక్తి ఒక్కరి సొంతం. మిగిలిన క్రీడల్లో గెలుపునకు ఎవరో ఒకరు భాగం తీసుకునే వీలుంది. కానీ.. చెస్ లో అలాంటివి సాధ్యం కావు. ఈ క్రీడలో విశ్వ విజేతగా నిలిచిన వారు అక్కడితో ఆగకుండా.. తమ ప్రస్థానాన్ని కొనసాగించాలని తపిస్తుంటారు. మళ్లీ మళ్లీ గెలవాలని భావిస్తారు.

కానీ. నార్వే చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్లసన్ కు మాత్రం అదే పనిగా గెలవటం బోర్ కొట్టేస్తుందట. అందుకే.. వచ్చే ఏడాది ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ టోర్నీలో పాల్గొనకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. తనకు మ్యాచ్ ఆడేందుకు అవసరమైన ప్రేరణ లభించట్లేదని.. కొత్తగా తానేం సాధిస్తానన్న భావన కలుగుతుందన్న సంచలన వ్యాఖ్యలు చేసిన అతడి మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ప్రపంచ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లో పాల్గొనాలన్న ఆసక్తి అందరిలో ఉంటుందని.. తనకు మాత్రం అందులో ఆడేందుకు ఎలాంటి ఆసక్తి లేదన్నారు. అందుకే ఈ టోర్నీ నుంచి తాను దూరం కావాల్సిన సమయం వచ్చేసిందన్నారు. భవిష్యత్తులో మళ్లీ తిరిగి రావొచ్చేమోనన్న మాటను చెప్పిన మాగ్నస్.. ఇప్పటికైతే తాను ప్రపంచ ఛాంపియన్ షిప్ టోర్నీలో మాత్రం ఆడటం లేదన్నారు.

అలా అని అతను చెస్ ఆటకు దూరం అయిపోతున్నారంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. అతను ఇప్పుడు పలు చోట్ల చెస్ ఆడేందుకు టూర్ షెడ్యూల్ చేసుకున్నారు. గ్రాండ్ చెస్ టూర్ కోసం క్రోయేషియా వెళుతున్ అతను అక్కడి నుంచి చెస్ ఒలింపియాడ్ ఆడేందుకు చెన్నైకి రానున్నారు. ఈ టోర్నీకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్య చేశాడు మాగ్నమ్. చెన్నైలో జరిగే టోర్నీ చాలా ఆసక్తికరమైనదిగా పేర్కొన్నారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గా 2013 నుంచి ఇప్పటివరకు అతనే గెలుస్తుండటంతో ఈ టోర్నీ మీద అతనికి ఆసక్తి పోయినట్లుగా చెబుతారు.

2013లో భారత చెస్ దిగ్గజ ఆటగాడు.. గ్రాండ్ మాస్టర్ విశ్వనాధ్ ఆనంద్ ను ఓడించటం ద్వారా తొలిసారి ప్రపంచ ఛాంపియన్ అయ్యారు. అప్పటికి అతని వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే. తర్వాతి ఏడాది కూడా ఆనంద్ ను ఓడించి రెండోసారి టైటిల్ ను సొంతం చేసుకున్న తర్వాత నుంచి ఇప్పటివరకు అతనికి ఎదురు లేదు. అంతేకాదు.. ప్రపంచ చెస్ చరిత్రలో అత్యధిక ఎలో రేటింగ్ సాధించిన చెక్ ప్లేయర్ గా అరుదైన ఘనతసు సొంతం చేసుకున్నాడు. ఏమైనా.. గెలుపు సైతం చేదుగా మారటం అరుదైనదిగా చెప్పక తప్పదు.