Begin typing your search above and press return to search.

జేసీ మాతృభాష‌... బూతు భాషేన‌న్న చెవిరెడ్డి

By:  Tupaki Desk   |   6 March 2017 10:31 AM GMT
జేసీ మాతృభాష‌... బూతు భాషేన‌న్న చెవిరెడ్డి
X
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై స్థాయిని మ‌రిచి, స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే టీడీపీ నేత‌, అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై అప్పుడే ఎదురు దాడి మొద‌లైంది. మొన్న మ‌ధ్యాహ్నం అనంత‌పురంలోని సాక్షి కార్యాల‌యం ముందు టెంటు వేసుకుని మ‌రీ కొడుకు అస్మిత్ రెడ్డితో క‌లిసి ధ‌ర్నాకు దిగిన ప్ర‌భాక‌ర్ రెడ్డి... జ‌గ‌న్‌పై దారుణ వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఆ వెంట‌నే జ‌గ‌న్ అభిమానులు కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు.

అయితే నేటి ఉద‌యం దాకా వైసీపీ నేత‌లు ఈ విష‌యాన్ని బ‌య‌ట ప్ర‌స్తావించిన దాఖ‌లా లేదు. తాజాగా నేటి ఉద‌యం వెల‌గ‌పూడిలో కొత్త‌గా ఏర్పాటైన తాత్కాలిక అసెంబ్లీలో ప్రారంభ‌మైన తొలి స‌మావేశాల‌కు జ‌గ‌న్ స‌హా ఆయ‌న పార్టీ స‌భ్యులంతా హాజ‌ర‌య్యారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం త‌ర్వాత స‌భ రేప‌టికి వాయిదా ప‌డ‌గా.. మీడియా పాయింట్ వ‌ద్ద‌కు వ‌చ్చిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి... జేసీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అస‌లు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఓ ప్ర‌జా ప్ర‌తినిధి అంటేనే త‌మ‌కు సిగ్గుగా ఉంద‌ని ఆయ‌న విచారం వ్య‌క్తం చేశారు.

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి లాగే తాను కూడా రాయ‌ల‌సీమ‌కు చెందిన వాడినేన‌ని చెప్పిన చెవిరెడ్డి... రాయ‌ల‌సీమ వాసుల మాతృ భాష తెలుగేన‌ని, అయితే రాయ‌ల‌సీమ‌కు చెందిన వాడైన‌ప్ప‌టికీ కూడా జేసీ మాతృ భాష మాత్రం తెలుగు కాద‌ని చెప్పారు. జేసీ మాతృ భాష... బూతు భాషేన‌ని కూడా చెవిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ఏ భాష మాట్లాడే వారికి అదే భాష వారికి మాతృ భాష‌గా ఉంటుంద‌ని, అలాగే నిత్యం బూతులు వ‌ల్లించే జేసీకి కూడా బూతు భాషే మాతృ భాష‌గా మారింద‌ని కూడా చెవిరెడ్డి సెటైర్లేశారు. స‌భ్య‌త మ‌రిచి మాట్లాడిన జేసీకి త‌మ‌కు కూడా అదే త‌ర‌హాలో స‌మాధానం ఇచ్చే ద‌మ్ము ఉంద‌ని, అయితే ల‌క్షలాది మంది ప్ర‌జ‌ల‌కు ప్ర‌తినిధులుగా, చ‌ట్ట‌స‌భ స‌భ్యులుగా ఉండి జేసీ మాట్లాడే నీచ స్వ‌భావం లేద‌ని చెప్పారు. అయినా... పిచ్చి ప‌ట్టిన‌ట్లు మాట్లాడే స్వ‌భావం ఉన్న జేసీ వ్యాఖ్య‌ల‌ను జ‌నంతో పాటు తాము కూడా ప‌ట్టించుకోబోమ‌ని కూడా ఆయ‌న చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/