Begin typing your search above and press return to search.

సీమ‌లో రాజ‌కీయం ఏమిటో చూపించారు!

By:  Tupaki Desk   |   20 May 2019 10:12 AM GMT
సీమ‌లో రాజ‌కీయం ఏమిటో చూపించారు!
X
మిగిలిన చోట్ల రాజకీయం ఎలా ఉన్నా సీమ‌లో మాత్రం భిన్న‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉంటుంది. ఈ విష‌యం యాత్ర సినిమాలో క‌నిపిస్తుంది కూడా. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య రాజ‌కీయ విరోధం ఉంటుంది. అంత‌టి విరోధులు కాస్తా.. ఎదురుప‌డితే మ‌ర్యాద‌గా మాట్లాడుకోవ‌టం క‌నిపిస్తుంది. ఎక్క‌డిదాకానో ఎందుకు తాజాగా జ‌రిగిన చంద్ర‌గిరి రీపోలింగ్ సంద‌ర్భంగా సీమ రాజ‌కీయాల‌కు త‌గ్గ‌ట్లుగా ఒక స‌న్నివేశం చోటు చేసుకుంది.

ఆదివారం రీపోలింగ్ జ‌రుగుతున్న పులివ‌ర్తివారిప‌ల్లెకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పోలింగ్ కేంద్రానికి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే టీడీపీ అభ్య‌ర్థి పులివ‌ర్తి నాని స‌తీమ‌ణి పులివ‌ర్తి సుధారెడ్డి ఉన్నారు. అక్క‌డికి వ‌చ్చిన చెవిరెడ్డిని చూసిన ఆమె.. న‌మ‌స్తే అన్నా అంటూ ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లారు.

దీనికి ప్ర‌తి న‌మ‌స్కారం చేశారు చెవిరెడ్డి. ఇంటికి వెళ‌దాం రండ‌న్నా.. తేనీరు తాగి వెళుదురంటూ అభ్య‌ర్థించారు. అయితే.. చెవిరెడ్డి మాత్రం.. పోలింగ్ స‌ర‌ళిని స‌మీక్షించ‌టానికి వ‌చ్చాన‌ని చెప్పారు. ఇక్క‌డ స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌ని.. ఆమె చెబుతుంటే చెవిరెడ్డి మాత్రం మౌనంగా ఫోన్ చూసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు.

కాసేప‌టికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్య‌ర్థి రెడ్డెప్ప అక్క‌డికి చేరుకున్నారు. ఆయ‌న్ను సైతం సుధారెడ్డి టీ తాగేందుకు ఇంటికి రండ‌న్నా అంటూ ఆహ్వానించారు. ఇప్పుడేమీ వ‌ద్ద‌మ్మ అంటూ ఆయ‌న న‌వ్వి ఊరుకున్నారు. త‌మ గ్రామానికి వ‌చ్చిన అతిధులు ఎవ‌రైనా స‌రే.. ఇంటికి ఆహ్వానించి టీ ఇవ్వ‌టం త‌మ మ‌ర్యాద అని.. వ‌స్తారా? రారా? అన్న‌ది వారిష్టంగా సుధారెడ్డి పేర్కొన్నారు. ఎన్నిక‌ల్లో పోటాపోటీ న‌డుస్తున్నా..త‌మ గ్రామానికి వ‌చ్చిన వారిని సాద‌రంగా ఇంటికి ఆహ్వానించే ధోర‌ణి సీమ‌లోనే క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.