Begin typing your search above and press return to search.

నిరసనకు దిగిన ఎమ్మెల్యే చెవిరెడ్డికి రిమాండ్

By:  Tupaki Desk   |   8 July 2016 12:45 PM GMT
నిరసనకు దిగిన ఎమ్మెల్యే చెవిరెడ్డికి రిమాండ్
X
ఏపీ విపక్ష ఎమ్మెల్యేల్లో ఫైర్ బ్రాండ్ తీరుతో మితిమీరిన దూకుడుతనంతో వ్యవహరించే ఎమ్మెల్యేల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును తరచూ ప్రస్తావిస్తుంటారు. ఏపీ అసెంబ్లీలో ఆయన హడావుడి ఎంత ఉంటుందో అందరికి తెలిసిందే. ఆయన సభలో ఉంటే చాలు.. అధికారపక్షం నేతలు హైరానా పడాల్సిందే. తన మాటలతో.. చేష్టలతో ఆయన వ్యవహారశైలి ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది.

తాజాగా ఆయనో నిరసన ప్రదర్శన చేపట్టారు. గురువారం రాత్రి సబ్ కలెక్టరేట్ ఎదుట ఆయన నిరసనకు దిగారు. ఈ ఉదంతంపై కేసు పెట్టిన పోలీసులు.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆయన్ను పుత్తూరు కోర్టులో హాజరు పర్చగా 15 రోజులు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన్ను చిత్తూరు జైలుకు తరలించారు.

నిరసన ప్రదర్శనకు దిగితేనే రిమాండ్ కు పంపుతారా? అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేతలు ప్రశ్నిస్తున్నారు. చెవిరెడ్డి విషయంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని.. జగన్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించటం గమనార్హం. చెవిరెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ వారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.