Begin typing your search above and press return to search.

కోదాడలో కేజీ చికెన్ రూ.100 ఎందుకు?

By:  Tupaki Desk   |   6 Aug 2015 4:23 AM GMT
కోదాడలో కేజీ చికెన్ రూ.100 ఎందుకు?
X
ఇవాళ.. రేపటి రోజున రకరకాల ఆఫర్ల గురించి వింటుంటాం. కానీ.. ప్రతి ఆఫర్ కి పైన ఒక బుజ్జి చుక్క పెట్టేసి.. కిందన ఆ చుక్కకు.. ‘‘నిబంధనలు వర్తిస్తాయి’’ అంటూ ఊసురుమనిపిస్తారు. కానీ.. నల్గొండ జిల్లా కోదాడలో మాత్రం అలాంటి చుక్క గుర్తులు ఏమీ లేకుండా ఓపెన్ ఆఫర్ అన్నట్లుగా బంఫర్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు ఇద్దరు చికెన్ వ్యాపారస్తులు.

కోదాడలోని ఇద్దరు బడా చికెన్ వ్యాపారుల మధ్య నడుస్తున్న పోటీ పుణ్యమా అని.. కేజీ చికెన్ ను కేవలం వంద రూపాయిలకే అమ్మేస్తున్నారు. కోదాడలో 25 చికెన్ షాపులున్నా.. ఇద్దరు బడా వ్యాపారుల మధ్య మొదలైన ధరల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకొని రికార్డు ధరకు అమ్మేస్తున్నారు.

దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. అంతేకాదు.. వారి మధ్య పోటీ పుణ్యమా అని రానున్న రోజుల్లో కేజీ చికెన్ రూ.90కి తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరిద్దరూ హోల్ సేల్ దుకాణాలుకావటం.. వీరిద్దరూ మిగిలిన దుకాణాలకు కోళ్లను సరఫరా చేసే వారు కావటం.. వీరి మధ్య మొదలైన వ్యాపార పోటీ ఇప్పుడు చికెన్ కొనాలన్న ఆలోచన లేని వారికి కూడా ఆలోచన తెప్పించేలా చేస్తుందని చెబుతున్నారు.

ఈ ఇద్దరి వ్యాపారుల పోటీ పుణ్యమా అని కోదాడలోని మిగిలిన చికెన్ వ్యాపారస్తులు తమ ప్రయోజనాల్ని వీరిద్దరూ భారీగా దెబ్బ తీస్తున్నారని వాపోతున్నారు. మరి.. వీరి మధ్య పోటీ ఎప్పుడు ముగుస్తుందో కానీ.. చికెన్ ప్రియులకు మాత్రం పండగే పండుగ అన్నట్లుగా ఉంది.