Begin typing your search above and press return to search.

కారుచౌక: కేజీ చికెన్ ‘ఫిఫ్టీ’

By:  Tupaki Desk   |   8 Sept 2015 10:08 AM IST
కారుచౌక: కేజీ చికెన్ ‘ఫిఫ్టీ’
X
ఓపక్క ఉల్లి ధర మండిపోతుంటే.. మరోవైపు చికెన్ ధరలు దారుణంగా పడిపోతున్నాయి. మార్కెట్ లోకి వచ్చి పడుతున్న బ్రాయిలర్ కోళ్లతో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి. మొన్నటివరకూ కేజీ చికెన్ రూ.వంద వరకూ ఉంటే.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా సగానికి సగం ధర పడిపోవటం గమనార్హం.

ఉన్నట్లుండి ఇంత దారుణంగా చికెన్ ధర పడిపోవటానికి కారణం శ్రావణమాసంగా చెబుతున్నారు. పూజలతో బిజీగా ఉండటంతో పాటు.. వ్రతాలు లాంటి భారీగా చేయటం కారణంగా నాన్ వెజ్ తినేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవటంతో డిమాండ్ భారీగా పడిపోయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ఒక్క ఏపీకి మాత్రమే పరిమితం కాకుండా.. దేశ వ్యాప్తంగా ఉండటంతో బ్రాయిలర్ కోళ్లకు ఉండే డిమాండ్ భారీగా పడిపోయింది.

దీంతో.. మూడు నెలల క్రితం వరకూ బ్రాయిలర్ కోళ్లను సరఫరా చేసే ఫ్రౌల్టీ ఫాంలకు కేజీకి రూ.75 వరకు లభిస్తే.. ఇప్పుడు మాత్రం రూ.48 కూడా లభించటం లేదని చెబుతున్నారు. బ్రాయిలర్ కోళ్ల డిమాండ్ భారీగా పడిపోవటంతో.. ఎంత వస్తే అంతకన్నట్లుగా తెగనమ్ముకోవటంతో చికెన్ ధరలు రోజురోజుకీ పడిపోతున్నాయి. ఇదే కాకుండా తమిళనాడుకు చెందిన ఫ్రౌల్టీ యజమానులు తమ బ్రాయిలర్ కోళ్లను ఏపీలో డంప్ చేయటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.

తమిళనాడులో డిమాండ్ భారీగా పడిపోయి.. ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో.. కొద్దోగొప్పో ఉన్న ధర పలుకుతున్న ఏపీ వైపు తమిళనాడు వ్యాపారులు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. దీంతో.. ఏపీలో చికెన్ ధరలు భారీగా పతనమవుతున్నాయని చెబుతున్నారు. ఈ ధరల క్షీణత మరికొంత కాలం సాగటం ఖాయమని చెబుతున్నారు.