Begin typing your search above and press return to search.

మోడీ సర్కారుపై చిదంబరం తాజా చురకలు విన్నారా?

By:  Tupaki Desk   |   6 Aug 2021 4:11 AM GMT
మోడీ సర్కారుపై చిదంబరం తాజా చురకలు విన్నారా?
X
ఎవరేమన్నా సరే మాకు తోచిందే చేస్తాం. నచ్చినట్లే నడుచుకుంటాం. ఎంతగా తప్పు పట్టినా స్పందించకుండా ఉండటం.. నిరసనల్ని లైట్ తీసుకోవటం.. ఆందోళనల్ని గుర్తించనట్లుగా ఉండిపోవటం లాంటివన్నీ మోడీ మార్కుగా చెప్పాలి. ప్రజాదరణతో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు తీరు గత ప్రభుత్వాలకు చాలా భిన్నంగా ఉంటుందని చెప్పాలి. ఏదైనా విషయం మీద పెద్ద ఎత్తున నిరసన.. అభ్యతరాలు వ్యక్తమైనప్పుడు దానికి సంబంధించిన ఒత్తిడి ప్రభుత్వం మీద సహజంగా ఉంటుంది. కానీ.. అలాంటివి తమకు అతీతమన్నట్లుగా మోడీ సర్కారు తీరు ఉంటుంది. ఈ విషయాన్ని చాలామంది ప్రస్తావించినా.. చెవిటివాడు ముందు శంఖం ఊదినట్లుగా వ్యవహరిస్తారే తప్పించి.. రియాక్టు కావటం అన్నది ఉండదు.

తాజాగా మాజీ కేంద్రమంత్రి చిదంబరం తండి ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. మోడీ మార్కు అయిన పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై ఎవరెన్ని విమర్శలు చేసినా.. అవేమీ చిదంబరం మాష్టారు వేసిన పంచ్ లకు సరిరావని చెప్పక తప్పదు. దేశ ప్రజలు పెద్దగా గమనించని ఒక కీలక విషయాన్ని ఆయన తాజాగా ప్రస్తావించారు. గడిచిన 19రోజులుగా దేశంలో పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగకపోవటంపై ఆయన ప్రశ్నించారు.

పెట్రోల్.. డీజిల్ ధరల్ని రోజువారీగా పెంచటం ఒక అలవాటుగా మార్చుకోవటం ద్వారా..లీటరు పెట్రోల్ వందను దాటించేస్తే.. డీజిల్నను సెంచరీకి దగ్గరగా తీసుకురావటమేకాదు.. సెంచరీని దాటించే మహాఅద్భుత కార్యక్రమం త్వరలోనే పూర్తి అవుతుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటివేళ.. పందొమ్మిది రోజులుగా పెట్రోల్.. డీజిల్ ధరలు ఎందుకు పెరగలేదు? వెనుకా ముందు చూడకుండా వడ్డించే మోడీ సర్కారు.. బాదుడు విషయంలో కాస్త గ్యాప్ తీసుకోవటానికి కారణం ఏమిటన్న ప్రశ్నలు చిదంబరం మాష్టారి మాటలు విన్నంతనే రాక మానదు.

మనకొచ్చే సందేహాల్ని.. చిదంబరం మాష్టారు.. తనదైన శైలిలో పంచ్ లు మీద పంచ్ లు వేశారు. దగ్గర దగ్గర మూడు వారాలుగా చమురు ధరలుపెంచకుండా ఉంచటానికి కారణం పార్లమెంటు సమావేశాలా? అన్న క్వశ్చన్ ను సంధించారు. ‘పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై 18 రోజులు అవుతోంది. వాటికోసమే ధరల్ని పెంచకుండా ఉన్నారేమో? లేదంటే చమురు సంస్థల అధినేతలు పెగాసస్ స్పైవేర్ నిఘా భయంలో ఫోన్లో మాట్లాడుకోవటంలేదా? అందుకే చమురు ధరలు పెంచలేదా?’ అంటూ భారీ పంచ్ లు వేసేశారు.

అక్కడితో ఆగని ఆయన.. పెగాసస్ భయంతో మాట్లాడుకోకపోవటం ద్వారా ధరల్ని పెంచి ఉండకపోవచ్చన్న చిదంబరం.. మరో సందేహాన్ని వ్యక్తం చేశారు. ‘లేదంటే వారంతా ఆగస్టు 15 వరకు క్వాంరటైన్ లోకి వెళ్లి ఉండొచ్చు. అందుకే ధరలు పెంచటం సాధ్యం కాలేదేమో?’ అంటూ ఎద్దేవా చేశారు. తాను చెప్పిన అన్ని కారణాలతోనే చమురు ధరలు పెంచి ఉండకపోవచ్చన్న చిదంబరం మాటలు టైమ్లీగా ఉండటమేకాదు.. నిజంగానే గడిచిన మూడు వారాలుగా ధరల్ని పెంచకుండా ఉండటానికి కారణం ఏమిటో దేశ ప్రజలకు మోడీ పరివారం ఏమైనా వివరణ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.