Begin typing your search above and press return to search.

అరెస్ట్ భయం: పరారీలో చంద్రబాబు నాయుడు ఫ్రెండ్?

By:  Tupaki Desk   |   21 Aug 2019 7:09 AM GMT
అరెస్ట్ భయం: పరారీలో చంద్రబాబు నాయుడు ఫ్రెండ్?
X
శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందనేది సామెత. కొన్ని సార్లు అలాంటి సంఘటనలు జరగుతూ ఉంటాయి. అందుకు నిదర్శనమే చిదంబరం అరెస్టుకు ఢిల్లీ హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా దేశమంతా తన చక్రం తిప్పగలుగుతున్నప్పుడు తన తనయుడి కోసం మూడు వందల కోట్ల రూపాయల డీల్ ఒకటి ఓకే చేయించుకున్నాడనే ఆరోపణలున్నాయి. అలాంటి డీల్స్ చాలానే ఉన్నా - మూడు వందల కోట్ల రూపాయల మొత్తాన్ని విదేశం నుంచి పెట్టుబడుల రూపంలో తెప్పించుకోవడంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి. వాటికి సంబంధించి బీజేపీ హయాంలో కేసు నమోదు అయ్యింది.

అందులో భాగంగా ఇప్పటికే సీబీఐ - ఈడీల విచారణ సాగింది. ఆ వ్యవహారంపై విచారణ చేయడానికి చిదంబరాన్ని అరెస్టు చేయడానికి ఆ సంస్థలు రెడీగానే ఉన్నాయి. అయితే దీనిపై చిదంబరం కోర్టుకు వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. ఆ వ్యవహారంపై ఢిల్లీ హై కోర్టు తేల్చేసింది. చిదంబరం అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు చిదంబరం ఇంటి వద్ద తచ్చాడుతూ ఉన్నారు. ఇంట్లోకి కూడా వెళ్లి వచ్చినట్టుగా సమాచారం. అయితే చిదంబరం జాడ లేదని టాక్. ప్రస్తుతం చిదంబరం పరారీలో ఉన్నారని, ఆయన సెల్ కూడా స్విచ్ఛాఫ్ అని వస్తోందని మీడియా వర్గాల్లో కథనాలు వస్తూ ఉన్నాయి.

చిదంబరం అరెస్టు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో గల సాన్నిహిత్యం చర్చకు వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడుకు, చిదంబరానికి సన్నిహిత సంబంధాలు బహిర్గతం అయ్యాయి గతంలోనే. వైఎస్ మరణానంతర పరిణామాల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో లోలోన దోస్తీ చేశారనే అభిప్రాయాలున్నాయి. ఆ విషయాన్ని చిదంబరం ప్రకటించారు.

చిదంబరం సెంట్రల్ లో సూపర్ పవర్ గా వెలుగొందుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ఆయనను కలిసినట్టుగా వార్తలు వచ్చాయి. వాటిని చిదంబరం ధ్రువీకరించారు. పార్లమెంటులో ఆ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఇటీవలి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు చంద్రబాబు నాయుడు పూర్తిగా సన్నిహితుడు అయ్యారు. అప్పుడు చిదంబరంతో కలిసి కనిపించారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అలాంటి చంద్రబాబు నాయుడు సన్నిహితుడు అరెస్టు అయ్యే అవకాశాల నేపథ్యంలో పాత వ్యవహారాలన్నీ జనాల్లో చర్చకు వస్తున్నాయి.