Begin typing your search above and press return to search.

నోట్ల మార్పిడి..ఆర్బీఐ ఉద్యోగి అరెస్ట్‌

By:  Tupaki Desk   |   13 Dec 2016 12:19 PM GMT
నోట్ల మార్పిడి..ఆర్బీఐ ఉద్యోగి అరెస్ట్‌
X
పెద్ద నోట్ల ర‌ద్దుతో నూత‌న క‌రెన్సీని ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల్సిన వారు ఏ విధంగా అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతున్నారో మ‌రోమారు స్ప‌ష్టంగా బ‌య‌ట‌పడింది. నోట్ల మార్పిడి కేసులో ఓ ఆర్బీఐ అధికారి అరెస్టు కావడం సంచలనం సృష్టించింది. బెంగళూరులో ఆర్బీఐకి చెందిన కే మైకేల్ అనే అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురికి నోట్ల మార్పిడికి సహకరిస్తున్నాడనే ఆరోపణలపై పోలీసు అధికారులు ఆర్బీఐ అధికారితోపాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.50 కోట్ల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మైకేల్ ఆర్బీఐలో ప్రత్యేక సహాయకునిగా పనిచేస్తున్నాడని, ఈ కేసుతో మైకేల్‌ కు సంబంధం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.

ఇదిలాఉండ‌గా కేంద్ర మాజీ ఆర్థిక శాఖా మంత్రి చిదంబరం నోట్ల ర‌ద్దు-త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై ఘాటుగా స్పందించారు. పెద్ద నోట్ల రద్దు భారీ కుంభకోణం అని పేర్కొంటూ దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. "దేశవ్యాప్తంగా రూ. 2 వేల నోట్లు పట్టుబడుతున్నాయి - దేశంలో ఏం జరుగుతోంది" అని చిదంబ‌రం ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా రూ. 24 వేలు బ్యాంకుల్లో ఇవ్వడం లేదని, బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో 45 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విత్తనాలు - ఎరువులు కొనేందుకు రైతుల వద్ద డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని చిదంబ‌రం వాపోయారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకున్నదని - నోట్ల రద్దును ప్రముఖ ఆర్థికవేత్తలు - ప్రధాన దినపత్రికలు ఖండిస్తున్నాయని చిదంబ‌రం పేర్కొన్నారు.

నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లిందని - నోట్ల రద్దు వల్ల ఏవరికి ప్రయోజనం కలుగుతుందో చూస్తూనే ఉన్నామని చిదంబ‌రం ఎద్దేవా చేశారు. అక్రమంగా పట్టుబడుతున్న రూ. 2 వేల నోట్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతిపరులకు, నల్లధనం కలిగి ఉన్నవారికి కాకుండా సామాన్య ప్రజలకు శిక్ష వేసినట్లు ఉందన్నారు. "ప్రకృతి విపత్తు వల్ల కూడా ఇంత నష్టం ఉండదు. డిమాండ్ లేకపోవడం వల్ల ద్రవ్యోల్బణం పడిపోయింది. అంతేకాకుండా డిమాండ్ లేకపోవడం వల్లే వస్తు ఉత్పత్తి కూడా తగ్గింది. కొన్ని నెలల్లో మూడు శాతం నుంచి వంద శాతం క్యాష్ లెస్ ఆర్థిక వ్యవస్థను సృష్టించడం వీలుకాదు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో వంద మంది అధికారులు పాల్గొంటారు కానీ ఎప్పుడూ బడ్జెట్ లీక్ కాలేదు. అసలు నోట్ల రద్దుపై ప్రధాని ఎవర్నీ సంప్రదించనప్పుడు, ఇందులో రహస్యం ఏముంది?" అని చిదంబ‌రం ప్ర‌శ్నించారు. దీర్ఘ కాలంలో జీడీపీపై నెగటివ్ ప్రభావం ఉంటుందని చిదంబరం అభిప్రాయపడ్డారు.

ఒకవేళ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయాలనుకుంటే, ఆ ప్రక్రియను ఒక ఏడాది కాలంలో చేసి ఉంటే బాగుండేదని చిదంబ‌రం అన్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా పూర్తిగా నగదు రహిత లావాదేవీల్లేవని గుర్తు చేశారు. క్యాష్ లెస్ ఆర్థిక వ్యవస్థ ఏ దేశంతో ఉందని ఆయన ప్రశ్నించారు. అమెరికాలోనా, సింగపూర్ లోనా అని ఆయన అడిగారు. నల్లధనం నిర్మూలన కోసం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు తన గోల్ పోస్ట్ ను మార్చి నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అంటూ మాటలు మారుస్తున్నట్లు చిదంబరం ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/