Begin typing your search above and press return to search.

ఆయన వస్తే అది నిజంగా అద్భుతమే .. ?

By:  Tupaki Desk   |   9 Dec 2019 7:19 AM GMT
ఆయన వస్తే అది నిజంగా అద్భుతమే .. ?
X
రాజకీయం ఏ క్షణాన ఏ రంగు పులుముకుంటుందో ఎవరికీ తెలియదు. దేనికైనా సమయం రావాలి అనేది రాజకీయానికి సరిగ్గా సరిపోతుంది. రాజకీయాలలో ఏమి జరిగిన అదొక అద్భుతమే...ఎందుకంటే జరిగే పరిణామాల తీవ్రత ఆలా ఉంటుంది. ఇకపోతే కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం కొన్ని రోజులు జైల్లో ఉండి ఈ మద్యే విడుదల అయిన విషయం తెలిసిందే. జైలు నుండి వచ్చిన తరువాత అయన చెన్నై కి తొలిసారిగా వచ్చారు. దీనితో కాంగ్రెస్ నేతలు ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. తొలి రోజు చెన్నైలో ఉన్న చిదంబరం ఆదివారం తిరుచ్చి వెళ్లారు.

ఈ సందర్భంగా చిదంబరం మీడియాతో మాటాడుతూ .. కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశంలో 30 కోట్ల మంది ప్రజలు పూట గడవలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు వారీ కూలీలు - పనులు చేసుకుంటున్న వీరి జీవితాల్ని దెబ్బ తీయడమే కాకుండా - పూట గడవనీయకుండా కేంద్ర పాలకులు ఉన్నారని ఆరోపించారు. రిజర్వు బ్యాంక్‌ ను సైతం బెదిరించి కోట్లు రాబట్టుకుని - దానిని కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలుగా ఇచ్చే పనిలో పడ్డారని మండి పడ్డారు. ప్రజల వద్ద జీఎస్టీ పేరుతో దోసుకుని కార్పొరేట్‌ సంస్థలకు ఆపన్నంగా రాయితీలు కట్టబెట్టనున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు వేసిన ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర ద్రోహం తలబెట్టి ఉన్నారని ఆరోపించారు. తనను జైల్లో పెట్టారని - తాను ఏ మాత్రం డీలా పడలేదని - కామరాజర్ - వివోసి వంటి వారు జైలు జీవితం గడిపి ఉన్నారని గుర్తుచేశారు.

ఇక ఇదే సమయంలో రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే మార్పు తధ్యమా..? అని ఆయనని ప్రశ్నించగా..అది ఆయన్నే అడగాలని అన్నారు. అలాగే ఆయన వస్తే అద్భుతం జరుగుతుందా..? అని అడగ్గా .. ఆయన వస్తే అద్భుతమే అని చెప్పారు. ఇకపోతే మరోవైపు రజినీ కాంత్ ఒప్పుకున్న సినిమాలని త్వరగా పూర్తి చేసి ..2021 సార్వత్రిక ఎన్నికలకి సిద్ధం కావాలని భావిస్తున్నారు. కానీ , రజినీ రాజకీయ ఎంట్రీ పై సస్పెన్స్ మాత్రం వీడటంలేదు. ఏదైనా పార్టీలో చేరతారా ..లేక ఆయనే సొంతంగా పార్టీ పెడతారా అని అభిమానులతో పాటుగా అందరూ ఎదురుచూస్తున్నారు.