Begin typing your search above and press return to search.

విభ‌జ‌న హామీల‌పై అధికారుల్ని త‌లంటిన చిదంబ‌రం!

By:  Tupaki Desk   |   31 Aug 2018 5:12 AM GMT
విభ‌జ‌న హామీల‌పై అధికారుల్ని త‌లంటిన చిదంబ‌రం!
X
రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో విభ‌జ‌న చ‌ట్టం అమ‌లుపై అధ్య‌య‌నం చేస్తున్న హోం శాఖ పార్ల‌మెంట‌రీ స్థాయి సంఘం తాజాగా ఢిల్లీలో స‌మావేశైంది. ఈ స‌మావేశం హాట్ హాట్ గా సాగ‌ట‌మే కాదు.. అధికారుల‌పై క‌మిటీ ఛైర్మ‌న్‌.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత చిదంబ‌రం వేసిన వ‌రుస ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌లేని అధికారులు కిందా మీదా ప‌డ్డారు.

స‌రైన కార‌ణం చూపించ‌కుండానే.. విభ‌జ‌న హామీల అమ‌లుపై అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌లేక నీళ్లు న‌మిలారు. విభ‌జ‌న చ‌ట్టంలోని ఒక్కో అంశాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఏది ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింది? హామీల అమ‌లు ఎందుకు సాధ్యం కాలేదు? ఇబ్బందులు ఏమిటి? ఎందుకు చేయ‌లేక‌పోతున్నారు? అంటూ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అధికారుల నుంచి మౌన‌మే స‌మాధాన‌మైంది.

అధికారుల తీరుపై చిదంబ‌రం తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.అదే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావిస్తూ.. ఏది అడిగినా స‌రైన స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నార‌ని.. వ్య‌వ‌హారాలు న‌డిపించేది ఇలానేనా? అన్ని అధికారులున్నా ఎందుకు చేయ‌టం లేదు? పార్ల‌మెంటు ఆమోదించిన చ‌ట్టం అమ‌లు చేసే బాధ్య‌త మీకు లేదా? అంటూ చిదంబ‌రం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లుగా స‌మాచారం.

ఈ స‌మావేశంలో క‌మిటీ స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న కాంగ్రెస్ స‌భాప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.. టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు.. బీజేపీ ఎంపీ ప్ర‌స‌న్న కుమార్ ప‌ట్ సాని.. ఎస్పీ ఎంపీ నీర‌జ్ శేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఏపీకి సంబ‌ధించి విభ‌జ‌న హామీల అమ‌లుపై దాట‌వేసే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించారు అధికారులు. నిధుల విడుద‌ల విష‌యంలోనూ వారు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఆగ్ర‌హంతో చిదంబ‌రం ప్ర‌శ్నించినా ప‌లువురు అధికారులు మౌనంగా ఉండ‌టం ద్వారా త‌మ స‌మాధానాల్ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే విభ‌జ‌న హామీల అమ‌లుకు నిధులు ఇవ్వ‌టంలో ఉన్న ఇబ్బంది ఏమిట‌ని ప్ర‌శ్నించ‌గా.. స‌మాధానం చెప్ప‌లేని అధికారుల్ని లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధానాలు ఇవ్వాల‌ని ఆదేశించారు. త‌ద్వారా అవి రికార్డు అవుతాయ‌ని పేర్కొన్నారు. హామీల అమ‌లు ప్ర‌క్రియ న‌డుస్తోంద‌ని అధికారులు చెబుతున్నార‌ని.. వారు చెప్పిందే తాను రాసుకుంటున్నాన‌ని.. నివేదిక‌ను ఎలా రూపొందించాలో త‌న‌కు తెలుసంటూ చిదంబ‌రం ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ స‌మావేశం మొత్తం హాట్ హాట్ గా సాగిన‌ట్లుగా తెలుస్తోంది. ఏపీ విష‌యంలో మోడీ స‌ర్కారు ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విష‌యంతాజా ఎపిసోడ్ తో మ‌రోసారి రుజువైన‌ట్లే!