Begin typing your search above and press return to search.

చిదంబ‌రం స‌త్తా ఇప్పుడు తేలుతుంది

By:  Tupaki Desk   |   13 July 2016 8:25 AM GMT
చిదంబ‌రం స‌త్తా ఇప్పుడు తేలుతుంది
X
కేంద్ర మాజీ ఆర్థిక శాఖ‌ మంత్రి పి చిదంబరం ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద ప‌రీక్ష‌నే పెట్టేందుకు సిద్ధ‌మ‌యిట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓడిపోయిన చిదంబ‌రంను ఇటీవ‌ల రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. మహారాష్ట్ర నుంచి ఎంపీగా పెద్ద‌ల స‌భకు వెళ్లిన చిదంబ‌రం ముందు కాంగ్రెస్ పెద్ద స‌వాల్‌ ను ఉంచ‌బోతుంద‌ని స‌మాచారం. తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవిని ఆయ‌న‌తో భ‌ర్తీ చేస్తార‌ని అంటున్నారు.

త‌మిళ‌నాడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2014 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఓడిపోయిన నాయ‌కుల జాబితాలో చిదంబ‌రం కూడా ఉన్నారు. ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సైతం కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది. పార్టీ ప‌రాభ‌వం పాల‌యిన‌ప్ప‌టికీ రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపే బాధ్యతను స్వీకరించడానికి పెద్ద ఎత్తున్నే నాయ‌కులు ముందుకువ‌చ్చారు. కానీ వారి సామ‌ర్థ్యంపై న‌మ్మ‌కం లేని ప‌లువురు నేత‌లు చిదంబరానికి పార్టీ పగ్గాలు అప్పగించినట్లైతే జాతీయస్థాయిలో ప్రాముఖ్యత సంతరించుకునే అవకాశముందని ఢిల్లీ పెద్ద‌ల ముందు ప్ర‌తిపాద‌న పెట్టారు. రాష్ట్ర నాయ‌కుల మ‌ధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో సీనియర్‌ కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం మంచిద‌నే చ‌ర్చ కూడా ఈ సంద‌ర్భంగా జ‌రిగిన‌ట్లు టాక్. దీనిపై కేంద్రస్థాయిలోనూ సానుకూలంగా ఉన్న‌ట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి చిదంబరం దీనిపై స్పందిచడానికి నిరాకరించారు.