Begin typing your search above and press return to search.

కేసీఆర్ 'నాలెడ్జ్' పై ఈసీ ఆగ్ర‌హం!

By:  Tupaki Desk   |   8 Sep 2018 5:52 AM GMT
కేసీఆర్ నాలెడ్జ్ పై ఈసీ ఆగ్ర‌హం!
X
ఎంత‌టి తెలివైనోడైనా స‌రే.. అప్పుడ‌ప్పుడు త‌ప్పులో కాలేస్తుంటారు. రియ‌ల్ జీవితం ఏమీ రీల్ జేమ్స్ బాండ్ సినిమా ఎంత మాత్రం కాదు. అన్నింటికి మించి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. కొన్నిసార్లు త‌మ‌కు తిరుగులేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే నేత‌లు త‌ర్వాతి కాలంలో ఎలాంటి గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇందుకు సంబంధించిన ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి.

త‌న‌కున్న బ‌లాల‌పై అపార‌మైన న‌మ్మ‌కం విశ్వాసంతో పాటు.. ప్ర‌త్య‌ర్థుల బ‌ల‌హీన‌త‌ల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉన్న అధినేత ఎవ‌రికైనా ఆత్మ‌విశ్వాసం ఒక స్థాయిలో ఉంటుంది. దానికి తోడు చేతిలో అధికారం ఉన్న‌ప్పుడు ఇది మ‌రింత ఎక్కువ అవుతుంది.

స‌రిగ్గా అలాంటి ప‌రిస్థితుల్లోనే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్. ముంద‌స్తు విష‌యంలో ప‌క్కా కాన్ఫిడెంట్ గాఉన్న ఆయ‌న తాను చేయించిన 18.. 19 స‌ర్వే రిపోర్ట‌ల‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నారు. గ్రౌండ్ లెవ‌ల్లో ఎవ‌రేమ‌నుకుంటున్నారు? అన్న విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు.ఈ కార‌ణంతోనే ఆయ‌న త‌మ‌కు 90 ప్లస్ సీట్లు వ‌స్తాయ‌ని ఖాయంగా చెబుతుంటే.. టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఈటెల రాజేంద‌ర్ లాంటోళ్లు అయితే.. మ‌రో అడుగు ముందుకు వేసి.. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌టం లేద‌ని అతిశ‌యానికి కొత్త అర్థం చెప్పేలా వ్యాఖ్యానిస్తున్నారు.

అంత‌కంత‌కూ పెరుగుతున్న ఆత్మ‌విశ్వాసంతో విలేకరుల స‌మావేశం పెట్టిన కేసీఆర్‌.. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయ‌న్న ఒక మీడియాప్ర‌తినిధి మాట‌ల‌కు త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చారు. త‌న‌కున్న నాలెడ్జ్ ప్ర‌కారం ఎన్నిక‌లు న‌వంబ‌రులో జ‌రుగుతాయ‌ని.. డిసెంబ‌రులో ప‌లితాలు వ‌స్తాయ‌న్న మాట‌తో పాటు.. ఈ విష‌యంపై అవ‌గాహ‌న లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా రాసేయొచ్చు.. అంచ‌నాలు క‌ట్టేయొద్ద‌న్న మాట‌ను కేసీఆర్ చెప్పారు. ఇక్క‌డి వ‌ర‌కూ ఆపినా బాగుండేది. తాను ఎందుకంత క‌చ్ఛితంగా చెబుతున్నాన‌న్న విష‌యాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘ ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ తో పాటు మిగిలిన క‌మిష‌న‌ర్ల‌తో తాను మాట్లాడిన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టేశారు.

కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన ఈ మాట‌ల్ని తెలుగు మీడియా పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌కున్నా.. జాతీయ స్థాయి మీడియా మాత్రం ఇదే పాయింగ్ ను ప్ర‌ముఖంగా అచ్చేసింది. సీపీఐ అగ్ర‌నేత సుర‌వ‌రం సైతం ఈసీ వ‌ద్ద‌కు వెళ్లి ఫిర్యాదు చేయ‌టంతో ఈ వ్య‌వ‌హారం సీరియ‌స్ గా మారింది.

ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉంటూ ముంద‌స్తుకు వెళుతున్న వేళ‌.. ఎన్నిక‌ల షెడ్యూల్ ఇలా ఉంటుంద‌న్న మాట‌ను చెప్ప‌టం.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై ఈసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ సంద‌ర్భంగా క‌ఠిన ప‌ద‌జాలాన్ని వాడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హించాలో రాజ్యాంగ‌ప‌ర‌మైన అధికారం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ కే ఉంద‌ని.. తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు లేద‌ని కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఓపీ రావ‌త్ వ్యాఖ్యానించ‌టం దీనికి నిద‌ర్శ‌నం.

ఎన్నిక‌లు ఫ‌లానా తేదీల్లో జ‌రుగుతాయ‌ని కేసీఆర్ చెప్ప‌టం ద్వారా త‌ప్పు చేసిన‌ట్లుగా ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ఎప్పుడు నిర్వ‌హించాల‌న్న విష‌యాన్ని తేల్చేందుకు మ‌రో ఐదారు రోజులు ప‌డుతుంద‌ని చెప్పిన ఆయ‌న‌.. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణపై కేసీఆర్ వ్యాఖ్య‌లు అర్థ‌ర‌హితం.. అనుచితంగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

ప్ర‌తి ఒక్క‌రూ చెప్పింది విన‌టం.. ప్ర‌తి భాగ‌స్వామితో మాట్లాడ‌టం త‌మ విధి అని.. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రిని తాము క‌లుస్తామ‌న్నారు.తెలంగాణ‌లో ఎన్నిక‌ల స‌న్న‌ద్ధ‌త‌పై మ‌దింపు చేసిన త‌ర్వాత తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌న్న మాట‌ను ఈసీ చెప్పారు. మొత్తానికి కేసీఆర్ త‌న మాట‌ల‌తో ఈసీని ఆగ్ర‌హానికి గురి చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.