Begin typing your search above and press return to search.

లా చేస్తున్నావా? పెళ్లి చేసుకోవా? చీఫ్ జస్టిస్ పాత ముచ్చట్లు

By:  Tupaki Desk   |   5 Aug 2021 6:02 AM GMT
లా చేస్తున్నావా? పెళ్లి చేసుకోవా? చీఫ్ జస్టిస్ పాత ముచ్చట్లు
X
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ ప్లాష్ బ్యాక్ కు వెళ్లారు. ఆసక్తికర నిర్ణయాల్ని తీసుకుంటూ తరచూ వార్తల్లోకి వస్తున్న ఆయన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని రీతిలో ఉన్న ఆయన వ్యవహారశైలి తెలుగువారికి గర్వంగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం నేపథ్యంలో తన బెంచ్ కు వచ్చిన వ్యాజ్యాన్ని.. తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాడిని కావటంతో తాను విచారించలేనని.. అయితే మధ్యవర్తిత్వం చేసుకోండి.. లేదంటే వేరు బెంచ్ కు పంపుతానని తేల్చేశారు. కేంద్రం సైతం.. మీరే పరిష్కరించాలని కోరినా ఆయన సున్నితంగా తిరస్కరించారే కానీ.. ఆయన మాత్రం కేసు విచారణకు మాత్రం ఓకే చెప్పలేదు.

తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిన ఆయన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ లా ఫర్మ్స్’ కాఫీ టేబుల్ బుక్ విడుదల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. తాను లా స్టూడెంట్ గా ఉన్న సమయంలో జరిగిన ఉదంతాల్ని వెల్లడించారు. తాను డిగ్రీ చదివే వేళలో.. ‘‘ఎందుకు లా చదువుతున్నావు? ఎక్కడా మరే ఉద్యోగమూ రాలేదా? పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదా?’’ అని అడిగేవారని పేర్కొన్నారు.

తొలితరం న్యాయవాదులకు కోర్టులో స్థిరమైన ప్రాక్టీస్ ఒక కలగా ఉండేదని.. లా చేయటం చివరి ప్రయత్నంగా భావించేవారన్నారు. తన వ్యక్తిగత అనుభవంతో మాట్లాడుతున్నానని.. వనరుల కొరత కారణంగా తమవంటి చాలామంది ప్రాక్టీస్ సమయంలోనే విషయాల్ని నేర్చుకున్నారన్నారు. ప్రస్తుతం దేశంలో వాణిఝ్య అవకాశాలు పెరగటంతో న్యాయవాదులకు డిమాండ్ పెరిగిందన్నారు.

న్యాయ సంస్థల కార్యకలాపాలతో సమాజానికి ఏమీ సంబంధం ఉండదన్న అపోహ కోర్టుల్లో ప్రాక్టీసు చేసే న్యాయవాదుల్లో ఉందని.. ఆ అభిప్రాయాన్ని తొలగించుకోవాలన్నారు. తన పాత అనుభవాన్ని తెలియజేసిన ఎన్వీ రమణ మాటలు విన్నప్పుడు.. ఒకవేళ ఆయన్నుప్రశ్నించే వారి మాటల ప్రభావానికి గురైనా.. పెళ్లి కాదేమోనని భావించినా.. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అయ్యే అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయేవారని చెప్పాలి. ఏమైనా.. మనసుకు నచ్చింది చేసినప్పుడు అవకాశాలు ఆటోమేటిక్ గా రావటమే కాదు.. అత్యున్నత స్థానాలకు చేరుకోవటం ఖాయమని చెప్పక తప్పదు.