Begin typing your search above and press return to search.

మాస్క్ లేకపోతే విమానంలో నుంచి దింపేయండి

By:  Tupaki Desk   |   3 Jun 2022 12:50 PM GMT
మాస్క్ లేకపోతే విమానంలో నుంచి దింపేయండి
X
కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచి విస్తరిస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కొవిడ్ కేసులు అమాంతం పెరుగుతుండటం వల్ల విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్కులు ధరించేలా పటిష్ఠంగా నిబంధనలు అమలు చేయాలని దిల్లీ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.నిబంధనలు ఉల్లంఘిస్తే పెద్ద మొత్తంలో జరిమానా విధించాలని చెప్పింది.

కరోనా తగ్గుముఖం పట్టిందని మాస్కులు శానిటైజర్లు పక్కనపెట్టేశారందరు. కానీ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. వదల బొమ్మాళి.. వదలా అంటూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. కొవిడ్ 19 మరోసారి కోరలు చాస్తోందనడానికి ఇవాళ నమోదైన కేసులే ఉదాహరణ. అందుకే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇతర దేశాల్లోనూ కరోనా విజృంభిస్తుండటంతో విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని దిల్లీ ధర్మాసనం పిలుపునిచ్చింది. ఎయిర్పోర్టులో, విమానాల్లో ప్రయాణికులు కచ్చితంగా మాస్కు ధరించేలా చర్యలు చేపట్టాలని సూచించింది.

నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. కొవిడ్ నిబంధనలు పాటించని వారిని విమానాల్లో ప్రయాణించడానికి అనుమతించకూడదని తేల్చి చెప్పింది.

కరోనా నిబంధనల ఉల్లంఘనపై దిల్లీ హైకోర్టులో దాఖలైన పిల్పై ధర్మాసనం విచారణ జరిపింది. కరోనా నిబంధనలు అమలు చేయడమే కాకుండా.. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలు, విమానాల సిబ్బందికి పూర్తి అధికారాలు ఇస్తూ కరోనాకి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయమని డీజీసీఏని ఆదేశించింది. పైగా నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులపై జరిమానా విధించడం తో పాటు సదరు వ్యక్తుల పేర్లను కూడా నో ఫ్లై లిస్ట్‌లో ఉంచాలని చెప్పింది. తినేటప్పుడు లేదా ఏదైనా తాగేటప్పుడు మాస్క్‌ని తొలగించేలా చిన్న వెసులు బాటు కల్పించింది.

ఇప్పటికే దేశంలో ఇవాళ 4వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలలో భారీ సంఖ్యలో ప్రజలు కొవిడ్ బారిన పడ్డారు. మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ పటిష్ట చర్యలు చేపడుతున్నాయి. కరోనా నిబంధనలను కఠినతరం చేసి కచ్చితంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.. నిబంధనలు పాటించకపోతే ఆంక్షలు విధించాల్సి వస్తుందని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.