Begin typing your search above and press return to search.

కొవిడ్ త‌గ్గినా.. ఆసుప‌త్రి వ‌ద‌ల‌రాః ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హం

By:  Tupaki Desk   |   13 May 2021 3:30 AM GMT
కొవిడ్ త‌గ్గినా.. ఆసుప‌త్రి వ‌ద‌ల‌రాః ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హం
X
దేశంలో క‌రోనా క‌ల్లోలం ఏ స్థాయిలో ఉందో అంద‌రికీ తెలిసిందే. నిత్యం ల‌క్ష‌లాది మంది వైర‌స్ బారిన ప‌డుతుండ‌గా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ‌వ్యాప్తంగా ఆసుప‌త్రులు ఎప్పుడో నిండిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో బెడ్లు దొర‌క్క అభాగ్యులు అల్లాడిపోతున్నారు. ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. కొంద‌రు పేషెంట్ల తీరు చూస్తే కోపం రాక‌మాన‌దు. సాక్షాత్తూ ముఖ్య‌మంత్రి వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు!

ఆసుప‌త్రుల్లో బెడ్లు దొర‌క్క‌.. ఆక్సీజ‌న్ అంద‌క ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే.. కొంద‌రు మాత్రం రోగం త‌గ్గిన త‌ర్వాత కూడా ఆసుప‌త్రుల‌ను వ‌దిలి వెళ్ల‌ట్లేద‌ట‌! కొవిడ్ తీవ్ర‌త చాలా వ‌ర‌కు త‌గ్గిన‌ప్ప‌టికీ.. వారు రోజుల త‌ర‌బ‌డి ఆసుప‌త్రుల్లోనే ఉంటున్నార‌ట‌. ఈ ప‌రిస్థితి క‌ర్నాట‌క‌లో ఎక్కువ‌గా ఉంద‌ట‌. ఈ విష‌యం తెలుసున్న సీఎం య‌డ్యూర‌ప్ప వారిపై మండిప‌డిన‌ట్టు స‌మాచారం.

క‌ర్నాట‌క‌లోని శివాజీన‌గ‌ర్ లో మంగ‌ళ‌వారం కొవిడ్ కేర్ సెంట‌ర్ ను సీఎం త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా రోగుల వివరాల‌ను ప‌రిశీలించారు. అందులో 334 మంది రోగులు 30 రోజులుగా ఆసుప‌త్రిలోనే ఉన్నార‌ట‌. మ‌రో 503 మంది 20 రోజులుగా ఆసుప‌త్రిలోనే ఉంటున్నార‌ట‌. అయితే.. వీరంద‌రికీ కొవిడ్ తీవ్ర‌త త‌గ్గ‌డం గ‌మ‌నార్హం.

వైర‌స్ తీవ్ర‌త త‌గ్గిన‌ప్ప‌టికీ.. వారు ఇంటికి వెళ్ల‌క‌పోవ‌డంతో మొత్తం 800పైగా బెడ్లు అవ‌స‌ర‌మైన వారికి అందుబాటులో లేకుండా పోయాయి. దీనిపై స్పందించిన సీఎం.. వారు వెంట‌నే ఇళ్ల‌కు వెళ్లిపోవాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. ఇక‌, టీకాలు రాగానే. అంద‌రికీ వేస్తామ‌ని, ఎవ్వ‌రూ ఆందోళ‌న చెందొద్ద‌ని చెప్పారు.