Begin typing your search above and press return to search.

మేమే బాకీ ఉన్నామ‌ని తేలిస్తే.. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తా: కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   12 Sep 2022 7:55 AM GMT
మేమే బాకీ ఉన్నామ‌ని తేలిస్తే.. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తా: కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌.. చెల‌రేగిపోయారు. అటు కేంద్రంపైనా.. ఇటు ఏపీపైనా నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఇటీవ‌ల ఏపీకి తెలంగాణ విద్యుత్ బ‌కాయి ఉందంటూ.. కేంద్రం పేర్కొన‌డం.. రూ.6 వేల కోట్ల‌కు పైగానే చెల్లించాల‌ని..చెప్ప‌డంపై కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ‌కు ఏపీనే బ‌కాయి ఉంద‌ని కేసీఆర్ వెల్ల‌డించారు.

తెలంగాణ‌కు ఏపీ నుంచి 17 వేల కోట్ల‌కు పైగా విద్యుత్ బ‌కాయిలు రావాల్సి ఉంద‌ని.. తాముప‌దే ప‌దే చెబుతున్నా కేంద్రంలోని మోడీ స‌ర్కారు వినిపించుకోవ‌డం లేద‌న్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న భారీ స‌వాల్ రువ్వారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఏపీకి విద్యుత్ బ‌కాయిలు ఉంద‌ని నిరూపిస్తే.. తాను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తానని చెప్పారు. ''నేనే చెప్పిన విద్యుత్ లెక్క‌లు త‌ప్ప‌ని తేలిస్తే.. ఈ క్ష‌ణంలోనే రాజీనామా చేస్తా.. దీనికి సిద్ధ‌మేనా'' అని కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర విద్యుత్ బిల్లుపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ.. మోడీ మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని అని ఆనాడే చెప్పానని విమర్శలు గుప్పించారు.

రాష్ట్రాలు ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నాయనేది ప్రగతి సూచికలో ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు. విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. మోడీ ప్రభుత్వం తొలి కేబినెట్‌లోనే తెలంగాణ గొంతు నులిమిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. సీలేరు పవర్ ప్రాజెక్ట్స్ స‌హా మండలాలను లాక్కున్నారని మండిపడ్డారు. విద్యుత్ చట్టంపై కేంద్రం పెత్తనం ఏమిటి? అని కేసీఆర్ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వాలకు సంప్రదించకుండా ఇష్టమొచ్చినట్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులపై మూకదాడులు చేస్తున్నారని, ఎదుటివారు చెబితే వినే సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణలు అనే ముసుగులో.. రైతులను దోచుకునే ప్రయత్నం ప్రధాని చేస్తున్నారని సీఎం కేసీఆర్ మోదీపై ఫైర్ అయ్యారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.