Begin typing your search above and press return to search.

విశ్వగురు మోడీ సర్కారు వైఫల్యాలపై గళం విప్పిన కేసీఆర్

By:  Tupaki Desk   |   13 Sep 2022 4:11 AM GMT
విశ్వగురు మోడీ సర్కారు వైఫల్యాలపై గళం విప్పిన కేసీఆర్
X
తాను టార్గెట్ చేసే వారికి సంబంధించిన సమచారాన్ని.. వారు చేసే పనుల్లోని తప్పుల్ని.. దాని కారణంగా జరిగే నష్టాన్ని లెక్కలు కట్టటం.. దానికి సంబంధించి.. జనాలకు ఇట్టే ఎక్కేసే ఒక వాదనను నిర్మించటం.. దాన్ని వల్లె వేయటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంత బాగా వచ్చన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే తెలివిని ఆయన మోడీని టార్గెట్ చేసేందుకు వినియోగిస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారుపై గురి పెట్టిన కేసీఆర్.. ఎప్పటిలానే మోడీ సర్కారు వైఫల్యాలపై విరుచుకుపడేందుకు భారీగానే అధ్యయనం చేసినట్లుగా చెప్పాలి.

ఏ అంశాల్ని ప్రస్తావిస్తే.. ఇట్టే ప్రజలు ఆకర్షితులు అవుతారో.. ఇప్పుడు అదే అంశాన్నిపదే పదే ప్రస్తావించటం ద్వారా తాను కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగా విద్యుత్ ను తన ఆయుధంగా ఆయన చేసుకోనున్నారు. విద్యుత్ వినియోగం ఇతర దేశాలతో పోలిస్తే ఎంత తక్కువగా ఉందన్న విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ.. మోడీ సర్కారు వైఫల్యాల్ని ఇంతలా ఉన్నాయన్న విషయాన్ని తెలియజేసే వాదనను సిద్ధం చేశారు.

తెలంగాణ ఆవిర్భావం నాటికి తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 970యూనిట్లు కాగా.. జాతీయ తలసరి వినియోగం 957 యూనిట్లుగా పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ తలసరి వినియోగం 2126 యూనిట్లకు చేరితే.. జాతీయ వినియోగం కేవలం 1255 యూనిట్లకు చేరినట్లుగా పేర్కొన్నారు. తాను చెప్పేవన్నీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కలుగా ఆయన పేర్కొంటూ.. అక్కడెక్కడో ఉన్నబుల్లిదైన సంపన్న దేశం ఐస్ ల్యాండ్ ప్రస్తావన తీసుకొచ్చారు.

ఐస్ ల్యాండ్ తలసరి వినియోగం 51,696 కాగా.. యూఎస్ 12,154 యూనిట్లు అని.. జపాన్ 7150 యూనిట్లు అయిన.. చైనా 6312 యూనిట్లు అని.. భూటాన్ వినియోగం 3126 యూనిట్లు అని పేర్కొన్నారు. 140 దేశాల జాబితాలో మన దేశ ర్యాంకు 104గా పేర్కొన్న ఆయన.. 'ఇది విశ్వగురువు ఘనత' అంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడే మరో పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాలి.

ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాలో 12,154 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగం ఉన్నప్పుడు.. ఐస్ ల్యాండ్ తలసరి వినియోగం 51,696 యూనిట్లుగా ఉందంటే.. ఆ చిట్టి దేశం కంటే అమెరికా వెనుకబడి ఉన్నట్లా? ఐస్ ల్యాండ్ తో పోలిస్తే అమెరికా ఘోరంగా ఫెయిల్ అయినట్లా? అక్కడి పాలకులు అమెరికాను భ్రష్ఠుపట్టిస్తున్నట్లా? లాంటి ప్రశ్నలను వేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ మాటల్ని వినే వేళ.. ఇలాంటి లాజిక్ లు మనసుకు చెప్పుకోకపోతే.. ఆయన మాటల ప్రవాహంలో పడిపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు తన వద్ద చిన్న కిటుకు ఉందన్న కేసీఆర్ ఆ విషయాన్ని తెలియజేస్తూ.. ''బిహార్ దుఖందాయనులుగా ముంద్ర పడ్డ కోసి.. గండకి నదులపై విద్యుదుత్పత్తి ప్రారంభిస్తే కరెంటు అందుబాటులోకి రావటంతో పాటు.. వరదల బాధా తప్పుతుంది. అలాంటి సలహా ఇచ్చినా చేయలేని అసమర్థ ప్రభుత్వం మోడీది'' అని మండిపడ్డారు. దేశంలో 24 గంటలు కరెంటు సరఫరా చేయగలిగే 2.42 లక్షల మెగావాట్ల కరెంటు అందుబాటులో ఉన్నా సరిగా వినియోగించలేని దుస్థితి ఉందన్నారు. చెత్త నుంచి కూడా విరివిగా కరెంటును ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉన్నా మోడీ ప్రభుత్వం చేయలేకపోయిందని విరుచుకుపడ్డారు. మొత్తానికి మోడీపై దండయాత్రకు అవసరమైన సరంజామాను భారీగానే సేకరించినట్లుగా చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.