Begin typing your search above and press return to search.

గుట్ట‌ల‌కు వంద‌ల కోట్లు.. కేసీఆర్ దానాల‌పై చ‌ర్చించుకోవాల్సిందే బాస్‌!

By:  Tupaki Desk   |   7 Dec 2022 11:30 PM GMT
గుట్ట‌ల‌కు వంద‌ల కోట్లు.. కేసీఆర్ దానాల‌పై చ‌ర్చించుకోవాల్సిందే బాస్‌!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారంటూ.. ఆయ‌న‌ను ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తీరా విష‌యం ఏంటంటే.. ఆయ‌న కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి ఆల‌యం అభివృద్ధికి రూ.100 కోట్టు కేటాయిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతేకాదు, ఈ ఆల‌యాన్ని యాదాద్రి త‌ర‌హాలో భారీగా విస్త‌రిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ‌ ప్రఖ్యాత స్థపతులను తీసుకొస్తామన్నారు. ఇప్పటికే 384 ఎకరాలు ఈ దేవాలయానికి ఇచ్చిన‌ట్టు చెప్పారు.

తెలంగాణలో పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయని వాటన్నింటినీ అభివృద్ధి చేసుకుందామన్నారు. అంతేకాదు బండలింగాపూర్‌ను మండలంగా ఏర్పాటు చేస్తామని జగిత్యాలలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో చెప్పారు.  ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాకే అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం పుష్కరాలు కూడా జరిపేవారు కాదన్నారు. జాతీయ రాజకీయా ల్లోకి వెళ్లేందుకు ప్రజల ఆశీస్సులు కావాలన్నారు.

కొంచెం ఇక్క‌డ బ్రేక్ వేద్దాం.. గుట్ట‌ల‌కు గుడుల‌కు వంద‌ల కోట్ల ప్ర‌జాధ‌నాన్ని కుడి చేయి.. ఎడం చేయి తేడా లేకుండా ఇచ్చేస్తున్న కేసీఆర్ విష‌యం.. విస్మ‌యానికి గురిచేస్తోంది. ఎందుకంటే.. ఇటీవ‌ల వంద‌ల మంది కాంట్రాక్ట‌ర్లు.. ప్ర‌భుత్వంపై స‌మ్మె ప్ర‌క‌టించారు.

త‌మ‌కు బిల్లులు పెండింగులో ఉన్నాయ‌ని.. ప‌నులు చేసి ఏళ్లు గ‌డుస్తున్నా త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కాంట్రాక్ట‌ర్లు ఏకంగా రాష్ట్ర వ్యాప్త నిర‌స‌న‌కు దిగారు. అంతేకాదు.. గ్రామాల్లో ర‌హ‌దారులు వేయాల‌ని ప్ర‌భుత్వం సంక‌ల్పించ‌గా.. ఒక్క‌టంటే.. ఒక్క టెండ‌రు కూడా రాలేదు.

దీంతో ''రండి బాబూ రండి!' అని కేసీఆర్ స‌ర్కారు వారిని బ‌తిమాలుకుని.. గ‌డ్డం ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక్కడ ఇంకో బ్రేక్ ఇద్దాం. ఉద్యోగుల జీతాల గురించి మాట్లాడుకుందాం. నెల‌లో 1వ తారీకునే ఇచ్చిన తెలంగాణ ఉద్యోగుల జీతాల ప‌రిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా త‌యారైందనేది రాష్ట్రం ఎరిగిన స‌త్యం. వారికి ఎప్పుడు ఇస్తున్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. 1 నుంచి 30 లోపు ఎప్పుడో ఒక‌ప్పుడు ఇస్తున్నారుగా..ఏం చేసుకుంటారు డ‌బ్బుల‌న్నీ అని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ వ్యాఖ్యానించి సంచ‌ల‌నం సృష్టించారు.

మ‌రోవైపు కేంద్రం నుంచి నిధులు రావ‌డం లేద‌ని.. అందుకే ప‌నులు పెండింగులో ఉన్నాయ‌ని స్వ‌యంగా సీఎం కేసీఆరే చెబుతున్నారు.  మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న రాష్ట్రం గుట్ట‌ల‌కు, గుళ్ల‌కు వంద‌ల కోట్లు ఇచ్చేయ‌డం 'హేమిటో' అనేది ప్ర‌జాస్వామ్య వాదుల వాద‌న‌. ఎవ‌రైనా బ‌య‌ట‌ప‌డితే.. కేసీఆర్ ద‌ళం వెంట‌నే ప్ర‌తిప‌క్ష ముద్ర‌వేసి.. దీనిని అడ్డు పెట్టుకుని మోడీపై మ‌రో యుద్ధం చేసేసే చాన్స్ ఉంది. ఏదేమైనా.. కేసీఆర్ అంటే కేసీఆరే!!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.