Begin typing your search above and press return to search.

కేసీయార్ కు మమత, నితీషే ఆదర్శమా?

By:  Tupaki Desk   |   6 Oct 2022 5:44 AM GMT
కేసీయార్ కు మమత, నితీషే ఆదర్శమా?
X
భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించబోతున్నారు. సీఎం హోదాలోనే దేశమంతా తిరగటానికి ప్లాన్ చేస్తున్నారు. చూస్తుంటే ఈ విషయంలో కేసీయార్ కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమారే ఆదర్శంగా ఉండేట్లున్నారు. మమత, నితీష్ కూడా సీఎంల హోదాలోనే బీజేపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

తృణమూల్ కాంగ్రెస్ అయినా జేడీఎస్ అయినా పేరుకి జాతీయ పార్టీలే దేశమంతా ప్రభావితం చేయగలిగిన స్ధితిలో లేవు. ఎన్నికల్లో తృణమూల్ గోవా, యూపీ రాష్ట్రాల్లో పోటీ చేసినా బోణీ కొట్టలేదు. అలాగే జేడీఎస్ కు బీహార్తో పాటు అస్సాం, మణిపూర్లో కూడా కొందరు ఎంఎల్ఏలు గెలిచారు. కాకపోతే వాళ్ళని ఈ మధ్యనే బీజేపీ ఎగరేసుకుపోయింది. మమత, నితీష్ సీఎంల హోదాలోనే వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ బీజేపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారు.

ఇప్పుడు ఆ సీఎంల దారిలోనే కేసీయార్ కూడా దేశమంతా పర్యటించాలని డిసైడ్ అయ్యారు. టీఆర్ఎస్ అధినేత హోదాలోనే కేసీయార్ చాలామంది సీఎంలతో పాటు శరద్ పవార్, అఖిలేష్ యాదవ్ లాంటి పార్టీల అధినేతలతో భేటీ అయ్యారు.

అయితే వాళ్ళ నుండి ఏ మేరకు సానుకూలత వచ్చిందన్నదే సందేహంగా ఉంది. కేసీయార్ ప్రధాన సమస్య ఏమిటంటే క్రెడిబులిటీ లేకపోవటమే. తెలంగాణా సీఎం ఏ రోజు ఎలాగుంటారో ? ఎవరితో సఖ్యతగా ఉంటారో ఎవరూ ఊహించలేరు.

అందుకనే కేసీయార్ ను జాతీయ రాజకీయాల్లో ఎవరూ సీరియస్ గా తీసుకోవటం లేదు. దాదాపు మమతాబెనర్జీది కూడా ఇలాంటి కేసే. తాను అనుకున్నది అనుకున్నట్లు ఇతర పార్టీలు అంగీకరిస్తే ఒకలాగుంటారు.

అలాకాదని తాను చెప్పినదాన్ని కాదంటే ఇక ఎవరినీ దగ్గరకు చేర్చరు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ విషయం అన్నీ పార్టీలకు స్పష్టంగా తెలిసొచ్చింది. మరి జాతీయ పార్టీ పెట్టిన తర్వాత కేసీయార్ మొదలుపెట్టబోయే మొదటి ఇన్నింగ్స్ ఎలాగుంటుందో చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.