Begin typing your search above and press return to search.

చంద్రబాబును వాడేసి మోడీని టార్గెట్ చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   12 Sep 2022 1:30 PM GMT
చంద్రబాబును వాడేసి మోడీని టార్గెట్ చేసిన కేసీఆర్
X
తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా మరోసారి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఒక మొక్కకు అంటుకట్టినట్టు.. ఓ గోడ కట్టినట్టు ఒక్కో రంగంలో తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై సవివరంగా కడిగిపారేశాడు. మోడీకి తెలంగాణ ఇచ్చిన అభ్యర్థనలు, నెరవేర్చని వైనాలు.. చివరకు అల్టీమేటాలు జారీ చేశారు. సంస్కరణల ముసుగు తొడిగి తీసుకొచ్చిన విద్యుత్ చట్టం విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ తీరుపైనా ఆయన మండిపడ్డారు. కేంద్ర మంత్రుల వ్యవహారశైలిని తప్పుపట్టారు. అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం.. వ్యవసాయం, విద్యుత్ రంగాలపైన ఇప్పుడు పడిందంటూ విరుచుకుపడ్డారు.

తెలంగాణకు విభజన జట్టంలో చేసిన అన్యాయాన్ని సైతం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కడిగిపారేశాడు. విద్యుత్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరామని.. లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్ట్ ను తెలంగాణ ఇవ్వాలన్నా ఇవ్వలేదని ఆరోపించారు. సింగరేణి కాలరీస్ పై తెలంగాణకే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.

2014లో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో మోడీ కీలుబొమ్మగా మారారని కేసీఆర్ ఆరోపించారు. అప్రజాస్వామికంగా ఏడు మండలాలు.. సీలేరు విద్యుత్ ప్రాజెక్ట్ ను ఆర్డినెన్స్ తో లాక్కున్నారని మండిపడ్డారు. నాడు బంద్ పిలుపునిస్తే తమపైనే విరుచుకుపడ్డారని వాపోయారు. చంద్రబాబును లాగి మరీ కేసీఆర్ మోడీని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

కేంద్రంలోని మంత్రులు అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీకి ఎప్పుడూ 50 శాతం ఓట్లు రాలేదని.. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఎంతో బాధపడుతున్నారని అన్నారు.

ఇప్పటికీ బీజేపీ దేశంలో 11 రాష్ట్రాలను కూలగొట్టిందని కేసీఆర్ విమర్శించారు. రాజ్యాంగ సంస్థలపైన సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఒక్క మంచి పని అయినా చేసిందా? అంటూ ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు కర్రు కాల్చి వాతపెడుతారంటూ కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు.

ఇక ఏపీకి విద్యుత్ బకాయిలు తెలంగాణ ఇవ్వడం కాదని.. ఏపీ నుంచే తమకు రావాల్సినవి చాలా ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. కృష్ణపట్నం పోర్టులో తమకూ భాగస్వామ్యం ఉందన్నారు. మేకిన్ ఇండియా ఏంటని.. అన్నీ చైనా నుంచి తెస్తూ కళ్లకు గంతలు కడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు.

రైళ్లు, ఎల్.ఐసీ సహా అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తూ బీజేపీ ప్రభుత్వం పప్పు బెల్లాల్లా అమ్ముతూ సొమ్ము చేసుకుంటోందని ఆరోపించారు.

మొత్తంగా అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఈరోజు బీజేపీని ఉతికి ఆరేశారు. కారణాలు, విశ్లేషణలతో సహా ఇరుకునపెట్టారు. మోడీని తిట్టేందుకు నాడు చంద్రబాబు చేసిన కుట్రలను బయటపెట్టి ఇద్దరినీ ప్రజల ముందు టార్గెట్ చేశారు. కేసీఆర్ పంచ్ డైలాగులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.