Begin typing your search above and press return to search.

జగన్ కే కేసీయార్ బాణం...వైసీపీకి తీరని నష్టం

By:  Tupaki Desk   |   13 Oct 2022 5:06 AM GMT
జగన్ కే కేసీయార్ బాణం...వైసీపీకి తీరని నష్టం
X
ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ ఇపుడు బీయారెస్ వస్తోంది అన్న చర్చ సాగుతోంది. తన టీయారెస్ ని బీయారెస్ గా కేసీయార్ మార్చేశారు. ఆయన ఏపీలో రాజకీయ వాటాను కచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఉమ్మడి ఏపీ నుంచి కేసీయార్ ఎవరో ఆంధ్రా వాళ్లకు తెలుసు. ఒక విధంగా సొంత రాష్ట్రం కిందనే ఏపీని భావించాలి. అలాంటి ఏపీని కేసీయార్ ఎందుకు వదులుకుంటారు. ఫుల్ సీరియస్ గానే ఫోకస్ పెడతారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీలో ఏమవుతుంది. అక్కడ ముగ్గులో ఉన్న మూడు ప్రధాన పార్టీలలో ఏ పార్టీకి రాజకీయ నష్టం వస్తుంది అన్నది ఇపుడు వాడి వేడి చర్చగా ఉంది.

అయితే దీని మీద అనేక రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. బీయారెస్ ఏపీలో పోటీకి దిగితే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, దాంతో జగన్ కి అడ్వాంటేజ్ ఉంటుందని విశ్లేషణలు ఉన్నాయి. నిజంగా అయితే ఎక్కువ పార్టీలు రంగంలో ఉంటే జరిగేది అదే. కానీ ఏపీలో మాత్రం అలా జరగదు అని ఆ పార్టీ వీరాభిమానిగా కొన్నాళ్ళు ఉండి అక్కడ ఒక మంచి పదవిని కూడా తీసుకుని అవమాన పరిస్థితుల్లో బయటకు వచ్చిన థర్టీ యియర్స్ ఇండస్ట్రీ పృద్వీ అంటున్నారు.

ఈ సినీ కమెండియన్ కమ్ పొలిటీషియన్ చూపు జనసేన మీద ఉంది అంటున్నారు. ఆయన వీలు దొరికినపుడల్లా జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇపుడు కూడా ఆయన బీయారెస్ ఎఫెక్ట్ కచ్చితంగా వైసీపీ మీద పడుతుంది అని తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణ వినిపించారు. అలా ఎందుకు అంటే తెలంగాణాలో బాగా అభివృద్ధి జరిగిందని, అదే ఏపీలో అయితే జగన్ ఏలుబడిలో రాష్ట్రం అన్ని విధాలుగా వెనక్కి పోయిందని పృధ్వీ చెప్పుకొచ్చారు.

అందువల్ల ఏపీ జనాలు కూడా కేసీయార్ కావాలని కోరుకుంటారని, అందువల్ల ఆయన పార్టీకి కచ్చితంగా ఆదరణ పెరిగితే అది అధికార వైసీపీకే దెబ్బ తీస్తుందని పృధ్వీ చెబుతున్నారు. ఇక ఏపీలో మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట అడుతోంది వైసీపీ సర్కార్ అని ఆయన విమర్శించారు. సుప్రీం కోర్టులో ఈ విషయం ఉన్నందున ఇప్పట్లో తేలే అవకాశం లేదని, దాంతో జనాలను వైసీపీ మభ్యపెడుతోందని ఆయన అంటున్నారు.

ఏపీలో చేయని అభివృద్ధి లేని ప్రగతి మీద మంత్రులను బెదిరించి మరీ జనాల్లో అబద్ధాలు చెప్పమని వైసీపీ అధినాయకత్వం బెదిరిస్తోందని పృధ్వీ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో వైసీపీకి రాజకీయ ఇబ్బందులు తప్పవని ఆయన జోస్యం చెప్పారు.

అదే సమయంలో ఏపీలో జనసేన టీడీపీ బాగా బలపడుతున్నాయని అన్నారు. జనసేన ఏకంగా 43 నియోజకవర్గాలలో బాగా పుంజుకుందని ఆయన అంటున్నారు. మొత్తానికి పృధ్వీ చేసిన ఈ కామెంట్స్ తో ఏపీ రాజకీయాల్లో కేసీయార్ బాణం తగిలేది జగన్ కేనా అన్న చర్చ అయితే వస్తోంది. అదే జరిగితే వైసీపీకి తీరని రాజకీయ నష్టమని చెబుతున్నారు. చూడాలి మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.