Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఒక దూకుడు.. మ‌రిన్ని స‌మ‌స్య‌లు!

By:  Tupaki Desk   |   19 Jan 2023 1:30 PM GMT
కేసీఆర్ ఒక దూకుడు.. మ‌రిన్ని స‌మ‌స్య‌లు!
X
తెలంగాణ ముఖ్యమంత్రి, భార‌త రాష్ట్ర‌స‌మితి అధినేత కేసీఆర్‌.. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే దూకుడు బాగుంది. తాజాగా నిర్వ‌హించిన ఖ‌మ్మం ఆవిర్భావ స‌భ‌ను కూడా ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి విజ‌యం చేశారు. అయితే.. ఈ దూకుడు ఎంత బాగున్నా.. దీనికి మించిన స‌మ‌స్య‌లు కేసీఆర్‌ను వెంటాడుతున్నాయి. మ‌రో 400 రోజుల్లో ప్ర‌ధాని మోడీని ఇంటికి పంపించి.. కేంద్రంలో పాగా వేస్తామ‌ని ఈ స‌భ వేదిక‌గా ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

అయితే.. ప్ర‌క‌ట‌న జారీ చేయ‌డం వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. దీనిని సాకారం చేసుకోవ‌డం అంత ఈజీయేనా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. అనుకున్నంత ఈజీగా అయితే.. ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌న్న‌ది జాతీయ రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నాగా ఉంది. ఎందుకంటే.. ఉత్త‌రాది నుంచి ఈశాన్య రాష్ట్రాలు, ద‌క్షిణాదిలోని మ‌రికొన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు అనుస‌రిస్తున్న వైఖ‌రి.. కేసీఆర్‌కు కొరుకుడు ప‌డ‌డం లేదు.

ఉదాహ‌ర‌ణ‌కు యూపీని తీసుకుంటే.. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఒడిశాలో ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల కూటముల్లో చేరకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పోనీ.. వీరు కేసీఆర్‌కు ద‌న్నుగా ఉంటారా? అంటే.. చెప్ప‌డం క‌ష్టం. ఎందుకంటే.. ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు వారికి ఉన్నాయి.

అదేస‌మ‌యంలో కాంగ్రెస్ వెంట ఇప్పటికే మ‌హారాష్ట్ర‌లోని ఎన్సీపీ, ఉద్ధవ్ సేన, త‌మిళ‌నాట‌ డీఎంకే, జార్ఖండ్ అధికార పార్టీ జేఎంఎం, బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ ఉన్నాయి. ఇందులో జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌‌కు ప్రధాని కావాలనే కోరిక ఉంది. దీంతో వీరు కేసీఆర్‌కు మ‌ద్ద‌తివ్వ‌డం సాధ్య‌మ‌య్యేది కాదు. మ‌రోవైపు కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ప్రధాని కావాలనుకుంటున్నారు.

విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా నిలవాలని ఆమె తలపోస్తున్నారు. అయితే ఆమె కాంగ్రెస్‌తో జత కట్టే విషయంలో తన వైఖరిని వెల్లడించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆమె ఈ విషయంలో వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటున్నారు. ఒక‌ప్పుడు కేసీఆర్‌తో క‌లిసి ప‌య‌నిస్తాన‌న్న ఈమె ఇప్పుడు మౌనం దాల్చ‌డం ఆలోచ‌న‌కు దారితీస్తోంది. ఇక ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాలని, కేంద్రంలో నిర్ణయాక శక్తిగా మారాలని యోచిస్తోంది.

అన్నింటినీ మించి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న కేసీఆర్‌కు జై కొట్టినా.. దీని వెనుక కూడా అనేక సందేహాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ దూకుడు.. బాగున్న‌ప్ప‌టికీ అనేక స‌మ‌స్య‌లు మాత్రం త‌ర‌ముతున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.