Begin typing your search above and press return to search.

మగాళ్లకు ముఖ్యమంత్రి లాక్‌డౌన్‌ సూచనలు

By:  Tupaki Desk   |   1 April 2020 6:15 AM GMT
మగాళ్లకు ముఖ్యమంత్రి లాక్‌డౌన్‌ సూచనలు
X
ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. అత్యావసరమైతేనే మినహా బయటకు ఎవరూ రావడం లేదు. ఈ సమయంలో ఇంట్లో ఉంటున్నారు. అయతే ఇంట్లో ఉన్న సమయంలో ఖాళీగా ఉండకుండా ఏవైనా పనులు చేయాలని ఒడిశా ముఖ్యమంత్రి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా మగాళ్లు మీరు ఈ ఈ పనులు చేయాలని సూచనలు చేశారు. ఇంట్లోని ఆడవారికి అండగా నిలబడాలని చెబుతున్నారు.

ఒడిశాలో కరోనా వైరస్‌ వ్యాప్తి, నివారణ, హోంక్వారంటైన్‌ తదితర వాటిపై మార్చి 31వ తేదీన ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమవడంతో ఈ సమయంలో ఇంట్లోని ఆడవారిపై భారం మోపవద్దని పురుషులకు సూచించారు. ఇంటి పనుల్లో సహకరించాలని తెలిపారు. వంటలతో ఆమెను కిచెన్‌కు పరిమితం చేయొద్దని చెబుతూనే విందువినోదాలకు ఇది సమయం కాదని స్పష్టం చేశారు. ఇంట్లోని వారందరూ కలిసిమెలసీ బతకాల్సిన సమయం అని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఇంటి పనుల్లో ఆడవారికి సహాయంగా పురుషులు సహకరించాలని కోరారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తాపీగా కూర్చొని కబుర్లు చెప్పడం.. ఖాళీగా కూర్చోవడం వంటివి చేయొద్దని చెప్పారు. రోజులో ఎన్నోసార్లు వంటలు చేస్తూ వంటింటికే మహిళలు పరిమితం కావడంపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో మహిళలు వంటింటికి పరిమితమైతే కుంగిపోతారని చెప్పారు. ఈ సమయంలో పురుషులు ఓపికతో ఉండాలని, వారికి అండగా నిలవాలని సూచించారు. ఆహార వేళలు మార్చుకోవాలని, భార్య కష్టాలు పంచుకుని ఇంటి వ్యవహారాల్లో భాగస్వాములు అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడి మమకారం పెరుగుతుందని దాని వెనుక ఉన్న రహాస్యం తెలిపారు.

విన్నారు గా ఒక ముఖ్యమంత్రి లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇళ్లల్లో ఏం పనులు చేయాలో.. ఇంట్లో ఉండాలో ఇక పురుష పుంగవుడా.. ఇంటి పనుల్లో భార్యకు సహాయపడు.. మధురానుభూతులు పొందు.