Begin typing your search above and press return to search.

డౌట్స్ సెష‌న్ : ముఖ్య‌మంత్రి ...దావోస్ వెళ్ల‌కూడ‌దా !

By:  Tupaki Desk   |   14 May 2022 12:12 PM GMT
డౌట్స్ సెష‌న్ : ముఖ్య‌మంత్రి ...దావోస్ వెళ్ల‌కూడ‌దా !
X
ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ దావోస్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విదేశీ పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణే ధ్యేయంగా ఆయ‌న అక్క‌డికి వెళ్తున్నార‌న్న‌ది ప్ర‌భుత్వ వ‌ర్గాల మాట. వ‌రల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌దస్సులో పాల్గొనేందుకు సీఎం వెళ్తున్నారు.

ప్ర‌జ‌లు, పురోగ‌తి, అవ‌కాశాలు అనే అంశాల ఆధారంగా ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఉన్న అనుకూల‌త‌ల గురించి సీఎం వివ‌రించనున్నార‌ని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ అంటున్నారు. అయితే మూడేళ్ల కాలంలో ఎటువంటి పెట్టుబ‌డుల‌పైనా మాట్లాడ‌ని సీఎం ఉన్న‌ట్టుండి స్విట్జ‌ర్లాండ్ టూర్ కు ప్లాన్ చేయ‌డం వెనుక ప్ర‌త్యేక ర‌హ‌స్యం ఏమ‌యినా ఉందా అని విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్లో ఇప్ప‌టి దాకా పెద్ద‌గా బ‌డా కంపెనీలు ఏవీ రాలేదు. గూగుల్ లాంటి సంస్థ‌లు కూడా విశాఖ‌ను కాద‌నుకుని హైద్రాబాద్ వైపే మొగ్గు చూపుతున్నాయి. కేటీఆర్ నేతృత్వంలో ఎప్ప‌టిక‌ప్పుడు రియ‌ల్ ఎస్టేట్, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మావేశాలు జ‌రుగుతున్నాయి.

వాస్త‌వానికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక రియ‌ల్ ఎస్టేట్ రంగం పూర్తిగా ప‌డిపోయింది. విశాఖ కేంద్రంగా కాస్త బెట‌ర్ గా ఉన్నా అది కూడా రాజ‌కీయ కార‌ణాలు రాజధాని కార‌ణాల రీత్యా న‌త్త‌న‌డ‌క‌నే ఉంది. ఈ దిశ‌గా ఆలోచించినా మ‌న‌కు అనేక విష‌యాలు వెలుగులోకి వస్తాయి.

గ‌తంలో అమ‌రావ‌తి కేంద్రంగా కొన్ని పెట్టుబ‌డులు వ‌చ్చాయి కానీ అవి వెన‌క్కు మ‌ళ్లాయి. ఏపీ ఆర్థిక పురోగ‌తి లేనందున కొత్త కంపెనీలు లేవు. ఉన్న వాటికి కూడా వైజాగ్ కేంద్రంగా రాష్ట్ర ప్ర‌భుత్వం స‌పోర్ట్ లేదు. పోనీ ఇప్పుడు విదేశీ ప్ర‌తినిధుల‌తో చేప‌ట్టే స‌మావేశాల్లో అయినా వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు ఏమ‌యినా సాయం చేస్తారా లేదా అన్న‌ది ఓ ఆస‌క్తిక‌ర విష‌యం.

ఇదే చ‌ర్చ‌నీయాంశం కూడా ! మే 22 నుంచి 26 వరకూ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సీఎం జ‌గ‌న్ ఏం చెబుతారో ఏ విధంగా పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌కు సిద్ధం అవుతారో అన్న‌ది తేలాల్సి ఉంది. కానీ టీడీపీ మాత్రం తాము తీసుకువ‌చ్చిన పెట్టుబ‌డుల‌పై ఆ రోజు జోకులు పేల్చిన వైసీపీ అధినేతపై ఇప్పుడు అవే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేయ‌డం గమనార్హం.