Begin typing your search above and press return to search.

బాబు.. పవన్ ఏం చేయలేరా...జగన్ ధీమాతో ధిమాక్ ఖరాబ్...?

By:  Tupaki Desk   |   27 Dec 2022 7:33 AM GMT
బాబు..  పవన్ ఏం చేయలేరా...జగన్ ధీమాతో ధిమాక్ ఖరాబ్...?
X
ఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా తన విజయం మరోమారు ఖాయం అన్న ధీమాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు. నిజానికి అధికారంలో ఉన్న వారికి ఆ ధీమా ఉండాల్సిందే. అయితే అది అతి ధీమాగా ఉందా లేక దాని వెనక లాజిక్ ఉందా అంటే జగన్ రాజకీయంగా రాటుతేరిన నేతగా ఉండడంతో ఆ తర్కాన్ని చూస్తే ఎవరి ధిమాక్ ఖరాబ్ కావాల్సిందే.

నిజానికి జగన్ వచ్చే ఎన్నికల్లో అస్త్రాలుగా కొన్ని సిద్ధం చేసుకుని ఉంచుకునారు. అలాగే తన సంక్షేమ పాలనను కూడా జనాలకు చెప్పుకుని మరోసారి పవర్ పట్టాలనుకుంటున్నారు ఇక అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల ఇష్యూ ఎటూ సిద్ధంగా ఉంది. వీటితో పాటు ఎన్నికల నాటికి అభివృద్ధి కార్యక్రమాలను పట్టాలెక్కించి కూడా జన విశ్వాసం పొందేలా జగన్ చూస్తున్నారు.

అయితే వీటికి మించి జగన్ వద్ద మరో ఆయుధం ఉందిట. అదే విపక్షాలను కలవరం పెడుతోంది. ఆ ఆయుధం ఏంటి అంటే చంద్రబాబు పవన్ ఇద్దరూ కలసినా విడివిడిగా పోటీ చేసినా తనకు ఏ మాత్రం పోటీ కారనే దృఢ విశ్వాసంతో జగన్ సాగుతున్నారు. ఏపీలో చంద్రబాబు పాలనను జనాలు చూసేసిన సినిమాగా జగన్ లెక్క కడుతున్నారు.

చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్. ఆ సీనియారిటీయే వచ్చే ఎన్నికల్లో ఆయనకు మైనస్ అవుతుంది అని కూడా అంచనా వేసుకుంటున్నారు. ఇక చంద్రబాబు ఇప్పటికే ఊరూరా తిరిగి జగన్ని వైసీపీని దారుణంగా విమర్శిస్తున్నారు. తమ పార్టీకి అధికారం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే చంద్రబాబు కొత్త కాదు కాబట్టి జనాలు ఆయన ప్రకటలను ఏవీ విశ్వాసంలోకి తీసుకోరు అన్నదే జగన్ ధీమాగా ఉంది.

అదే టైం లో చంద్రబాబు హామీలు ఎన్ని అయినా ఇస్తారు కానీ అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెడతారు అని పేరుంది. ఒక విధంగా బాబు విశ్వసనీయత జనాల్లో ప్రశ్నర్ధకం అని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఎన్ని టూర్లు వేసి ఎన్ని హామీలు ఇచ్చినా కూడా జనాలు ఆయన్ని ఏ మాత్రం నమ్మే పరిస్థితి లేనే లేదని అంటున్నారు.

ఇక చంద్రబాబు తన టూర్లలో ఎంతసేపూ జగన్ని విమర్శించడం తప్ప తాను అధికారంలోకి వస్తే ఫలానా పని చేసి తీరుతామని చెప్పడంలేదు. అది కూడా జగన్ గమనిస్తున్నారు అని అంటున్నారు. ఒకవేళ బాబు చెప్పినా దాని ఇంపాక్ట్ ఏమీ ఉండదనే జగన్ దగ్గర ఉన్న సమాచారం. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్. ఆయన ఈ మధ్య ఏపీలో హడావుడి చేస్తున్నారు. జనసేన వచ్చే ఎన్నికల్లో క్రియాశీలమైన పాత్ర పోషిస్తుంది అని అంటున్నారు.

అయితే పవన్ విషయంలో కూడా విశ్వసనీయత ఇబ్బంది పెడుతుంది అన్న లెక్కలు వైసీపీ వేస్తోందిట. ఒకసారి టీడీపీతో జత కట్టి మరోసారి విడిపోయి మళ్ళీ టీడీపీతో జతకడితే అది కచ్చితంగా జనసేనకు కూడా ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు. అలాగే ఈ రెండు పార్టీలు కూడా విడిగా పోటీ చేసినా కలసినా కూడా తన ప్రభుత్వాన్ని దించేటంత పరిస్థితి ఉండబోదని కూడా జగన్ నమ్ముతున్నారుట.

ఎందుకంటే ఈ ఇద్దరి మైత్రిని జనాలు చూసేశారని, పైగా జనసేన కూడా గెలవకపోయినా పవన్ రెండు ఎన్నికలను చూసారని, దాంతో ఈ రెండు పార్టీల నుంచి కొత్తగా జనాలు ఏమీ ఆశించేది ఉండబోదని కూడా జగన్ బాగా నమ్ముతున్నారుట. ఏది ఏమైనా కూడా ఏపీలో విశ్వసనీయతకు నమ్మకలేమికి మధ్య పోటీ ఉంటుందని, అదే తనను మరోసారి సీఎం ని చేస్తుందని జగన్ భావిస్తున్నారుట.

మరి జగన్ అంచనాలు లాజిక్ గా చూస్తే కరెక్టే. అవి నిజమవుతాయా లేదా అన్నది మాత్రం 2024 ఎన్నికల ఫలితాలే చెప్పాలి. మరో వైపు చూస్తే ఏపీలో విపక్షాలకు ఏ చాన్స్ ఇవ్వకుండా జగన్ రాజకీయం ఉంది. అలాగే ఆయన విపక్షాలను లైట్ తీసుకుంటున్న వైనమే ఇపుడు ఎవరికైనా ధిమాక్ ఖరాబ్ చేసేలా ఉంది అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.