Begin typing your search above and press return to search.

టీకాల కోసం ముఖ్యమంత్రులు బెదిరిస్తున్నారు.. పూనావాలా సంచలనం

By:  Tupaki Desk   |   2 May 2021 4:38 AM GMT
టీకాల కోసం ముఖ్యమంత్రులు బెదిరిస్తున్నారు.. పూనావాలా సంచలనం
X
ముక్కుసూటిగా మాట్లాడటం సీరం సీఈవో అదర్ పూనావాలాకు మొదట్నంచి అలవాటే. మొహమాటం ఆయనకు అస్సలు ఉండదు. తనకు అనిపించింది.. అనిపించినట్లుగా చెప్పేస్తారు. కోవాగ్జిన్ విషయంలోనూ ఆయన ఇదే తరహా దూకుడు ప్రదర్శించారు. అనంతరం భారత్ బయోటెక్ రంగంలోకి దిగి ప్రతిదాడి మొదలుపెట్టిన వెంటనే.. వెనక్కి తగ్గిన ఆయన సారీ చెప్పటం.. అప్పటి నుంచి తన ప్రత్యర్థిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవటం తెలిసిందే.

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తీవ్రతరం కావటం.. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో సీరం.. భారత్ బయోటెక్ సంస్థలపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ తయారు చేసే రెండు సంస్థల అధినేతలతో ఫోన్లలో మాట్లాడటం తెలిసిందే.

ఇలాంటివేళ.. లండన్ లో ఉన్న సీరం సీఈవో అదర్ వాలా నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. ‘ది టైమ్స్’ మీడియా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తనను వ్యాక్సిన్ ఇవ్వాలని పలువురు ముఖ్యమంత్రులు బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. ‘నువ్వు మాకు వ్యాక్సిన్ పంపకుంటే బాగుండదని వాళ్లు బెదిరిస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అంటున్నారు. మమ్మల్ని దిగ్బంధించి.. పనులుసాగించకుండా నిలువరించే దురుద్దేశం వారి బెదిరింపుల్లో కనిపిస్తోంది’ అన్న మాటలు కలకలం రేపుతున్నాయి.

ఈ క్రమంలోనే ఆయన బ్రిటన్ లోనే ఎక్కువ కాలం ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు.. టీకా ఉత్పత్తి బ్రిటన్ తో సహా పలు దేశాల్లో చేపట్టాలన్న ఆలోచనలో ఆయన ఉండటం గమనార్హం. టీకా ఉత్పత్తిపై మరికొన్ని రోజుల్లోకీలక ప్రకటన చేస్తానని ఆయన చెబుతున్నారు. తనకెదురైన పరిణామాలపై ఓపెన్ గా మాట్లాడే పూనావాలా.. టీకా కోసం తనను బెదిరించిన ముఖ్యమంత్రులు ఎవరన్న విషయాన్ని బయటపెడితే బాగుంటుందని చెబుతున్నారు. ఏమైనా.. టీకాల కోసం ముఖ్యమంత్రులు ఏకంగా బెదిరింపులకు దిగారన్న మాట ఇప్పుడు షాకింగ్ గా మారింది. పూనా వాలా పేర్కొన్నట్లుగా వ్యాక్సిన్ తయారీ విదేశాల్లో చేపడితే.. ఖర్చు పెరగటమే కాదు.. దేశంలో వ్యాక్సిన్ స్టాక్టు కొరత మరింత ఎక్కువయ్యే వీలుంది.