Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్: 'పేట'పై పాగా వేసేదెవరో..?

By:  Tupaki Desk   |   22 March 2019 9:59 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్: పేటపై పాగా వేసేదెవరో..?
X
అసెంబ్లీ నియోజకవర్గం: చిలకలూరిపేట
టీడీపీ: ప్రత్తిపాటి పుల్లారావు
వైసీపీ: విడదల రజనీ
జనసేన : మిరియాల ర‌త్న‌కుమారి

గుంటూరు జిల్లాలో ఆర్థికంగా బలమున్న నియోజకవర్గాల్లో చిలకలూరిపేట ఒకటి. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిలకలూరిపేటలో వరుసగా టీడీపీ విజయం సాధిస్తూ వస్తోంది. ఈసారి ఎలాగైనా జెండా ఎగురవేయాని వైసీపీ భావిస్తోంది. ఇందు కోసం సర్వే నిర్వహించి మరీ విడదల రజినీ అనే కొత్త అభ్యర్థిని ఎంపిక చేశారు. మంత్రి పుల్లారావు అభివృద్ధి విషయంలో పెద్దగా పట్టించుకోలేదనే వాదనను వైసీపీ తెరపైకి తీసుకొస్తుంది. మంత్రి పదవి వరించాక పుల్లారావు నియోజకవర్గంపై చిన్న చూపు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి వైసీపీ చిలకలూరిపేటలో విజయకేతనం ఎగురవేయనుందా..? అనేది ఆసక్తిగా మారింది.

* చిలకలూరిపేట చరిత్ర:
మండలాలు: నాదేండ్ల, నెర్లపాడు, చిలకలూరిపేట
ఓటర్లు: లక్షా 90 వేలు
ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం ఎక్కువే ఉంది. దాదాపు 50 వేల ఓట్లు వారివే. అభ్యర్థుల గెలుపోటములలో వీరే కీలకంగా మారనున్నారు. వీరిని ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. చిలకలూరిపేట టీడీపీకి కంచుకోటగా ఉంటోంది. ఇక్కడి కమ్మ సామాజిక వర్గం టీడీపీకి కలిసొస్తుంది. 1989 నుంచి ఈ నియోజకవర్గంలో ఆరు సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగుసార్లు టీడీపీ జెండా ఎగురవేసింది. ఒకసారి కాంగ్రెస్‌, మరోసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

* టీడీపీ సంక్షేమంపైనే ప్రత్తిపాటి పుల్లారావు ఆశ
1999 నుంచి పుల్లారావు వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు.గత ఎన్నికల్లో 10వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఆయనకు మంత్రి పదవి వరించింది. ఫలితంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసే అవకాశం దక్కిందని ఆయన చెప్పారు. మరోసారి అవకాశం వస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అంటున్నారు.ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గంలో ఉంటూ ప్రజలకు దగ్గరగా ఉండే నేతగా పుల్లారావుకు పేరొచ్చింది. టీడీపీ చేపట్టిన పథకాలు కూడా కలిసి రావడంతో అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది.

+ అనుకూలతలు:
-వరుసగా విజయాలు సాధించడం
-పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం
-మంత్రిగా పనిచేయడం.
-నియోజకవర్గంలోనే ఉండడం

+ ప్రతికూలతలు:
-నియోజకర్గంలోనే ఉన్నా ప్రజలను పట్టించుకోలేదనే వాదన
-మంత్రి పదవి వచ్చాక నియోజకవర్గంలో కనిపించడం లేదని ఆరోపణలు

+వైసీపీ కొత్త అభ్యర్థి విడదల రజనీ ప్రభావం చూపేనా?
మొన్నటి వరకు ఇక్కడ వైసీపీ తరుపున ఉన్న మర్రి రాజశేఖర్‌కు టికెట్‌ వస్తుందని అనుకున్నారు. కానీ జగన్‌ ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో సర్వే చేయించడంతో ఆయన ఓటమి ఖాయమని తేలింది. దీంతో కొత్త అభ్యర్థి కోసం జగన్‌ అన్వేషించారు. ఈ తరుణంలో విడదల రజనీ వైసీపీలోకి చేరడంతో ఆమెను నియోజకవర్గ కన్వీనర్‌ గా నియమించారు జగన్‌. అటు ఆర్థికంగా బలమున్న నేత కావడంతో రజనీని పుల్లారావుపై పోటీకి నిలబెట్టారు. అయితే ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని ఉన్న తమ నేతకు టికెట్‌ రాలేదని మర్రి రాజశేఖర్‌ వర్గీలు నిరసన తెలిపారు. కానీ జగన్‌ రాజశేఖర్‌ తో మాట్లాడి హామీ ఇవ్వడంతో సర్దుకున్నారు.

+ అనుకూలతలు:
-ఇటీవల జగన్‌ నిర్వహించిన సభకు అనూహ్య స్పందన
-పార్టీ క్యాడర్‌ సపోర్టు పూర్తిగా ఉండడం
-అసంతృప్తి తొలిగిపోవడం

+ ప్రతికూలతలు:
-బలమైన నేత పోటీగా ఉండడం
-కొత్తగా బరిలోకి దిగడం

*జనసేన నుంచి రత్నకుమారి
జనసేన నుంచి చిలకలూరిపేట అభ్యర్థిగా ఈసారి మహిళను దించారు. మిరియాల రత్నకుమారి అనే మహిళను జనసేన ప్రయోగించింది. ఇక్కడ మల్లిఖార్జున రావు టికెట్ ఆశించినా కాలదన్ని ఆమెకే జనసేనాని పవన్ టికెటిచ్చాడు. దీంతో ఆయన అసంతృప్తి మీద ఉన్నాడు. కొత్త అభ్యర్థి అయిన రత్నకుమారి టీడీపీ, వైసీపీ అభ్యర్థులను ఢీకొట్టడం కష్టమేనట..

* ప్రత్తిపాటిపై వ్యతిరేకతే కీలకం
ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రతిపాటి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు. ఈయనపై ఉన్న వ్యతిరేకతపైనే వైసీపీ అభ్యర్థి రజినీ విజయం ఆధారపడి ఉంది. కొత్త అభ్యర్థి, అలిగేషన్స్ లేకపోవడం కూడా ఈమెకు కలిసివస్తున్నా.. ఇన్నాళ్లు జనంలో లేకపోవడమే మైనస్. ఆర్థికంగా బలంగా ఉన్న ఈమె అన్నివిషయాల్లో ప్రతిపాటిని ఎదురిస్తున్నా..జనాలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది కీలకం.. ఇక్కడ అధికంగా కమ్మ సామాజికవర్గం ఉండడంతో ప్రతిపాటి విజయంపై ధీమాగా ఉన్నా.. వైసీపీ గాలి కలిసివస్తే మాత్రం రజినీ గెలవడం ఖాయం.