Begin typing your search above and press return to search.

నీలోఫర్ లో ఆ చిన్నారిని చంపేసిన దారుణ నిర్లక్ష్యం!

By:  Tupaki Desk   |   11 Oct 2019 6:24 AM GMT
నీలోఫర్ లో ఆ చిన్నారిని చంపేసిన దారుణ నిర్లక్ష్యం!
X
మాటలకు అందని నిర్లక్ష్యంగా ఈ ఉదంతాన్ని చెప్పాలి. ఒక చిన్నారిని ఆసుపత్రి వైద్యులు.. సిబ్బంది వ్యవహరించిన ధోరణి.. చిన్నారికి నూరేళ్లు నిండేలా చేసింది. పేరుకు పెద్దాసుపత్రే కానీ.. వైద్యం చేసే విషయంలో నిలువెత్తు నిర్లక్ష్యం కమ్మేసిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రాణాలతో చెలగాటం ఆడటమే కాదు.. ప్రాణాలు పోయిన తర్వాత కూడా మానవత్వంతో వ్యవహరించని వైనం అవాక్కు అయ్యేలా చేయటమే కాదు.. కట్టలు తెగేంత కోపం వచ్చేలా చేస్తుందని చెప్పాలి.

డెంగీతో బాధపడుతున్న చిన్నారికి గంటల కొద్దీ ఆలస్యంగా వైద్యం చేయటంతో ఆ పాప ప్రాణాలు పోయేలా వ్యవహరించారు నీలోఫర్ వైద్యులు. సంచలనంగా మారటమే కాదు.. విన్నంతనే విషాదం కమ్మేసే ఈ ఉదంతంలోకి వెళితే.. బోడుప్పల్ కు చెందిన కృష్ణమూర్తి - మంజుల దంపతుల కుమార్తె అక్షర. మూడు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న పాపకు తామున్న దగ్గర్లోని ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.

గురువారం తెల్లవారుజామున అక్షరకు వాంతులు.. విరేచనాలు కావటంతో నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి తీసుకురాగా.. డెంగ్యూ తో బాధపడుతున్న విషయాన్ని గుర్తించి నీలోఫర్ కు రిఫర్ చేశారు. ఉదయం 10 గంటలకు ఆసుపత్రిలో ఆడ్మిట్ చేసుకున్న అక్షరకు బ్లడ్ అవసరం ఉందని చెప్పి.. ఆమెది ఓ నెగిటివ్ బ్లడ్ అంటూ రిపోర్ట్స్ ఇచ్చారు. ఆ రక్తం నీలోఫర్ లో లేకపోవటంతో బయట ప్రయత్నించారు. పలు బ్లడ్ బ్యాంకుల్లో ప్రయత్నించినా దొరకలేదు.

దాదాపు ఐదుగంటల వెతుకులాట తర్వాత మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక బ్లడ్ బ్యాంకులో ఓ నెగిటివ్ దొరికింది.అక్కడి వారు పాప రక్తం శాంపిల్ ను పరీక్షించి.. ఓ పాజిటివ్ అయితే.. నెగిటివ్ ఎందుకు తీసుకెళుతున్నారంటూ ప్రశ్నించారు. దీంతో షాక్ తిన్నవారు తిరిగి వచ్చి ఆసుపత్రిలోని డ్యూటీ ఆర్ ఎంవోకు ఫిర్యాదు చేయటంతో స్పందించి మళ్లీ బ్లడ్ టెస్ట్ చేయగా.. ఓ పాజిటివ్ అని తేలింది. ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులోనే ఆ రక్తం ఉండటం గమనార్హం.

పాపకు అవసరమైన బ్లడ్ ను తీసుకొచ్చేసరికి సాయంత్రం నాలుగున్నర అయ్యింది. అయితే.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సాయంత్రం ఆరున్నర గంటల వరకూ బ్లడ్ ఎక్కించలేదు. ఉదయం పది నుంచి వైద్యం కోసం ఎదురుచూసిన చిట్టి ప్రాణం.. ఇక ఓపిక లేక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. పాప కండీషన్ క్రిటికల్ గా మారిందన్న విషయాన్ని గుర్తించిన వైద్యులు.. అప్పటికప్పుడు హడావుడి చేశారు. అప్పటికే నిర్జీవంగా మారిన పాపను చూసి తల్లడిల్లిపోయిన కుటుంబ సభ్యులు.. చిన్నారి మరణానికి కారణమైన వైద్యుడితో పాటు.. ల్యాబ్ టెక్నిషియన్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు.

పోలీసులు వచ్చి బాధితుల్ని సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఒక వైద్యుడు దురుసుగా వ్యవహరిస్తూ.. శవాన్ని ఆసుపత్రి బయట పడేయాలని హుంకరించటంతో ఇష్యూ మరింత సీరియస్ అయ్యింది. తర్వాత తన తప్పును తెలుసుకొన్న సదరు వైద్యుడు క్షమాపణలు చెప్పినా.. పోయిన ప్రాణం మాత్రం తిరిగి రాలేదు సరి కదా? నిలువెత్తు నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్న వైద్యులకు.. సిబ్బందికి ఎలాంటి శిక్ష విధించాలి?