Begin typing your search above and press return to search.

జగనన్నా ఇది విన్నారా? చిన్నారి కారం సంధ్యను కాటేసిన డెంగీ

By:  Tupaki Desk   |   2 Sep 2022 4:22 AM GMT
జగనన్నా ఇది విన్నారా? చిన్నారి కారం సంధ్యను కాటేసిన డెంగీ
X
దాదాపు నెల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పిలిపించుకొని మాట్లాడిన పదేళ్ల చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి. చలాకీగా మాట్లాడే ఆ చిన్నారి మాటలకు ముచ్చట పడిన సీఎం జగన్.. ఆమెతో పలు మాటలు మాట్లాడారు. ఇప్పుడు అదే చిన్నారి విగతజీవిగా మారిన వైనం అందరి కంటతడి పెట్టిస్తోంది. వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా జులై 27న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కుయుగూరులో ముఖ్యమంత్రి పర్యటించిన వైనం తెలిసిందే.

ఈ సందర్భంగా చలాకీగా తిరుగుతున్న పదేళ్ల చిన్నారి కారం సంధ్యను చూసిన జగన్.. ఆ పాపను దగ్గరకు పిలిచి మాట్లాడారు. ప్రైవేటు స్కూల్లో చదువుతున్న చిన్నారి ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు ఎంతో చలాకీగా సమాధానాలు చెప్పింది.

తన తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలమని.. తన అక్క కంటే తానే బాగా చదువుతానని చెప్పింది. తనకు విద్యా కానుక.. అమ్మఒడి పథకాలు అందాయని చెప్పటంతో సీఎం జగన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా సీఎం ఆ పాపకు ఆశీర్వాదాలు అందించారు.

నెల తిరిగే సరికి ఆ పాప డెంగీ బారిన పడి కన్నుమూసింది. సంధ్య తండ్రి మాజీ సర్పంచ్. తల్లి అంగన్ వాడీ టీచర్ గా పని చేస్తుంటుంది. గత నెల 29న ఏసుబాబు జ్వరం బారిన పడటంతో భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు.

అప్పుడు తండ్రితోనే సంధ్య ఉంది. చికిత్స తర్వాత ఏసుబాబు కోలుకొని ఇంటికి వచ్చేశారు. అనంతరం సంధ్య జ్వరం బారిన పడింది. ఆమెను చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలానికి తీసుకెళ్లారు.

అక్కడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి సంధ్య కన్నుమూసింది. నెల క్రితం సీఎంతో చలాకీగా మాట్లాడిన చిన్నారి ఇప్పుడు విగతజీవిగా పడి ఉండటం అందరిని కలిసివేసింది. జగనన్నా.. చూస్తున్నావా? నువ్వు మెచ్చిన చిన్నారి ఇప్పుడెలా పడి ఉందో అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వైనం అయ్యో అనిపించేలా ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.